తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్ మండపానికి వేంచేపు చేశారు. ఈ తరువాత రామయ్య కోసం నరసింహ తీర్థం నుంచి తీర్థాన్ని తెచ్చారు. ఆ తెచ్చిన తీర్థంతో శ్రీ కోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 7 గంటల నుంచి శ్రీరామపట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామ లక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై శ్రీరామపట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.