వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి వారి పుష్పయాగం

కార్వేటి నగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీన ముగిశాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు ముగింపు పలికారు. అనంతరం శుక్రవారం పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న మధ్యాహ్నం 1.30 నుంచి ఆలయంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. తులసి, చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, తామర, కలువ, మొగలిరేకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. పుష్పయాగం అనంతరం రాత్రి 7 నుంచి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈఓ శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖ‌ర్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends