శ్రీకాళహస్తి మండలం తొండమాన్‌పురం గ్రామంలోని శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న అభయహస్త ఆసీన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం, సాయంత్రం పెద్ద ఎత్తున వివిధ వాహన సేవలు నిర్వహించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవాలను కన్నుల పండువగా జరిగాయి. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శన చక్రానికి స్నానం చేయించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించారు. దీంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రవి కుమార్ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.