పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమ‌వారం ఉద‌యం 10.10 నుండి 10.30 గంట‌ల‌ వరకు ధ్వజారోహ‌ణంతో శాస్త్రోక్తంగా బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. మార్చి 14వ తేదీ వరకు బ్ర‌హ్మోత్స‌వాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు.

అనంత‌రం సాయంత్రం 6 గంట‌లకు శ్రీ‌వారి క‌ల్యాణోత్స‌వం వైభ‌వంగా జ‌రిగింది. ఇందులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆల‌య అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళ సూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన పిఠాపురం ప‌రిస‌ర ప్రాంతాల‌ భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

మార్చి 11న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి గ‌రుడ వాహ‌న సేవ జ‌రుగ‌నుంది. మార్చి 11, 12, 13వ తేదీల‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం వైభ‌వంగా జ‌రుగ‌నుంది. మార్చి 12, 13వ తేదీల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు ఊంజ‌ల్‌సేవ చేప‌డ‌తారు. మార్చి 14న ఉద‌యం 10.10 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం, సాయంత్రం 5 గంట‌లకు ధ్వ‌జావ‌రోహ‌ణం నిర్వహించనున్నారు. మార్చి 15న సాయంత్రం 5.30 గంట‌లకు పుష్పయాగం నిర్వ‌హిస్తారు.

Share this post with your friends