ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీ వెంకటరమణ ‘తార, మండోదరి మాటలు’ అనే అంశంపై మాట్లాడుతూ, తార, మండోదరి ఇద్దరూ రామాయణంలో ముఖ్యమైన పాత్రలని తెలిపారు. తార వాలి భార్య, మండోదరి రావణుని భార్య, ఇద్దరూ తమ భర్తలకు సలహా ఇస్తూ, వారిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేశారన్నారు.
వాలిని యుద్ధానికి వెళ్ళే ముందు, సుగ్రీవుడితో శాంతింపమని, దౌత్యపరమైన చర్యలతో శాంతియుతంగా జీవించమని, ఉన్నతమైన రాముడితో స్నేహం చేయమని కోరిందన్నారు. వాలి ఆమె హెచ్చరికను తోసిపుచ్చడంతో యుద్ధంలో మరణించినట్లు వివరించారు. అదేవిధంగా మండోదరి రావణుడిని మంచి మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించింది, కానీ విఫలమైందన్నారు. అనంతరం మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ శ్రీనివాస్, శ్రీ సుగుణాకర్, శ్రీ పవన్ కుమార్ బృందం తులసీ జలంధరపై చేసిన హరికథ గానం భక్తిభావాన్ని పంచాయి. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన లావణ్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన నేత్రపర్వంగా జరిగింది.