తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యార్థం నూతన వసతి గృహాలను నిర్మిస్తున్నారు. ఈ వసతి సముదాయాలను తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరి పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం (పీఏపీ-5)లో మంగళవారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నూతన భవనంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కళ్యాణకట్ట, డైనింగ్ హాల్, లాకర్ల ఏర్పాటు, మరుగుదొడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు అన్నమయ్య భవన్ లో పీఏసీ-5 నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ హరీంధ్రనాథ్, శ్రీ వెంకటయ్య, ఈఈలు శ్రీ వేణు గోపాల్, శ్రీ సుధాకర్, డీఈ శ్రీ చంద్ర శేఖర్, వీజీవో శ్రీ సురేంద్ర పాల్గొన్నారు.