శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం.. అందరికీ అర్థమయ్యే రీతిలో..!

మనసారా స్వామిని కొలిచి…

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్య మప్రియమ్ ప్రియంచనానృతం బ్రూయాత్ ఏష ధర్మస్సనాతనః సత్యం పలకాలి. ప్రియంగా పలకాలి. ఎప్పుడూ కూడా బాధకలిగించేదైతే సత్యాన్ని కూడా పలకరాదు. సత్యం చెబుతూనే, కష్టం కలిగించే సత్యం పలకకపోవడమే ధర్మం. ఇష్టం కలిగించడం కోసం అసత్యం చెప్పకూడదు.
సత్యవచన ప్రభావం అప్పటికప్పుడు ఎలా కనిపిస్తుందో శ్రీసత్యనారాయణ స్వామి వ్రతకథల్లో దృష్టాంతాలు కనిపిస్తాయి. సత్యనారాయణస్వామి కలియుగంలో ‘వీరవేంకట సత్యనారాయణ స్వామి’ నామం ధరించి అన్నవరంలో రత్నగిరిపై వెలిశాడు. అన్నవరం క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలో ఉంది. ఈ ఆలయంలో ఆచరించే శ్రీసత్యనారాయణ వ్రతాన్నే అందరూ ఇంటింటా చేసుకుంటారు. తెలుగువారే కాకుండా అన్ని ప్రాంతాలవారూ, అన్ని భాషలవారూ ఈ వ్రతం ఆచరిస్తారు.
ఏ ఇతర వ్రతానికీ లేని ఆకర్షణ శక్తి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉంది. ఏ ఇంట పెళ్లిపేరంటం జరిగినా మొదటిగా సత్యనారాయణ వ్రతం చేస్తారు. పెళ్లితంతు పూర్తికాగానే నూతన దంపతులు గృహస్థధర్మంలో ప్రవేశించేముందుగా ఈ వ్రతాన్ని చేయడం ఆచారం. గృహప్రవేశం సమయంలోనూ భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ వ్రతాన్ని చేస్తారు. సాధారణంగా దంపతీయుక్తంగా ఆలుమగలిద్దరూ కలిసి చేసుకునే ఈ వ్రతం తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా చేసుకోవచ్చు. అన్నవరంలోనూ, ఇతర పుణ్యక్షేత్రాల్లోనూ సామూహిక సత్యనారాయణ వ్రతాలు విరివిగా జరుగుతుంటాయి. విష్ణుప్రియమైన వైశాఖ, కార్తిక, మాఘమాసాల్లోనూ ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆచరిస్తారు.
అన్నవరంలోని శ్రీసత్యనారాయణ స్వామి ఆలయం పంచాయతన పద్ధతిలో నిర్మించారు. అందుకే ఈ వ్రతంలో పంచలోక పాలక పూజ చేస్తారు. అలాగే త్రిమూర్తులు ముగ్గురినీ పూజించిన ఫలితం సత్యదేవుని పూజతో కలుగుతుంది. అష్టదిక్కులకు అధిపతులైన అష్టదిక్పాలకులను, నవగ్రహాలను తాంబూలాలతో పూజించడం ఈ వ్రతంలోని ప్రత్యేకత. అందుకే ఈ వ్రతంతో దేవతలందరినీ పూజించిన సంతృప్తి కలుగుతుంది. అటువంటి శ్రీసత్యనారాయణ స్వామి వ్రతవిధానాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో.. ప్రముఖ పండితుల సూచనల మేరకు మీ అందరికి అందిస్తున్నాము.

పూజాద్రవ్యాలు

పసుపు, కుంకుమ, విడిపూలు, పూలమూరలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, అగరుబత్తీలు, హారతికర్పూరం, గంధం, ఖర్జూరపండ్లు, పసుపుకొమ్ములు, టవల్స్, జాకెట్ ముక్కలు, బియ్యం, కొబ్బరికాయలు, చిల్లరడబ్బులు, దారపుబంతి, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, దీపారాధన కుందులు, వత్తులు, నువ్వుల నూనె, కలశం (చెంబు), మామిడి ఆకులు స్వామి వారి చిత్రపటం లేదా ప్రతిమ.

సూచనలు

ఏడాదిలో ఏ శుభదినాన అయినా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. వైశాఖ, కార్తిక, మాఘ మాసాలలో చేస్తే ఎంతో శుభం.
మాససంక్రాంతులలో, ఏకాదశి, పూర్ణిమ తిథుల్లో చేసుకుంటే మంచి ఫలితాన్నిస్తుంది.
ఏ శుభకార్యాన్నైనా ఆరంభించే ముందు లేదా ఇంట్లో శుభకార్యం చేసుకున్న తరువాత ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
పగలు లేదా సాయంత్రం ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సాయంత్రం చేసే పూజ మరింత ఫలదాయకం.
ఈ వ్రతాన్ని ఇంట్లోనూ చేసుకోవచ్చు. దేవాలయాలలో, పుణ్యక్షేత్రాలలో, నదీతీరంలో, సాగర సంగమం వద్ద చేస్తే వేయింతల ఫలం లభిస్తుంది.
ఈ వ్రతాన్ని కుల, లింగ, వర్గాలతో సంబంధం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. అవివాహితలు, బ్రహ్మచారులు, విధవలు, విధురులు సైతం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. తదనుగుణంగా సంకల్పం చెప్పుకోవాలి.
ఇంటిలో ఏదైనా అశుభం జరిగినప్పుడు అంటే ఏటిసూతకం వంటివి ఉన్నప్పుడు ఏడాది లోపల ఈ వ్రతాన్ని చేసుకోకపోవడమే మంచిది. సూతకం తీరినవెంటనే చేయవచ్చు.

శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం

కావాల్సిన పదార్థాలు
కప్పు గోధుమ నూక (రవ్వ) (మరీ సన్నటిది కాదు, కాస్త బరకగా ఉండేది), రెండు కప్పుల తురిమిన బెల్లం, అరకప్పు పంచదార, ఏలకుల పొడి, తగినంత నెయ్యి (ఆవు నెయ్యి శ్రేష్ఠం), వేయించిన జీడిపప్పు, కిస్మిస్, లేత కొబ్బరి ముక్కలు, అరటి పండు ముక్కలు, ఆవు పాలు

మొదట మూడు కప్పుల నీళ్లు బాణలిలో పోసి వేడి చేయండి. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వేయండి. 5 నిమిషాల పాటు రవ్వ ఉడకనివ్వండి. తరువాత బెల్లం, పంచదార, కాస్త నెయ్యి, ఏలకులపొడి వేయండి. మొత్తం మిశ్రమాన్ని 7-8 నిమిషాల పాటు సన్నటి సెగపై కలియబెట్టండి. పాకం బాగా పట్టింది అన్నదానికి సూచిక నెయ్యి పైకి కనిపించటం. అప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, చిన్నచిన్న ముక్కలుగా కోసిన అరటిపండు, లేత కొబ్బరిముక్కలను ఆ మిశ్రమంలో కలపండి. పాలతో నివేదన చేయాలనుకునేవారు కాచిన పాలను కొంచెం కలపండి. ఒక పాత్రలో చేతి వేళ్లతో కాస్త నెయ్యి పూసి అందులోకి ఈ ప్రసాదాన్ని తీయండి.

గమనిక కొన్ని ప్రాంతాలవారు స్వామివారికి పొడి ప్రసాదాన్ని నివేదిస్తారు. వారు వేయించిన రవ్వలో తురిమిన బెల్లం లేదా పంచదార, ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్, అరటిముక్కలు కలిపితే ప్రసాదం సిద్ధమౌతుంది.

ఈ పూజలో అన్ని మంత్రాలను ఒక వ్యక్తి చదువుతూ ఉండగా మిగిలిన వారు పూజ నిర్వహించుకోవచ్చు. ప్రతివారూ ప్రత్యేకంగా మంత్రపఠనం చేయవలసిన అవసరం లేదు. సంకల్పం చెప్పేటప్పుడు మమ అంటూ గోత్రనామాలు చెప్పుకోవాలి.

గణపతి పూజ

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!
ఆచమనం: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః (నీళ్లను పళ్లెంలో వదలాలి. తదుపరి నమస్కారం చేస్తూ ఈ క్రింది నామాలను పఠించాలి)
ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయనమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః

శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః
అరుంధతీవశిష్ఠాభ్యాం నమః శ్రీసీతారామాభ్యాం నమః

నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః
అయం ముహూర్తః సుముహూర్తోఅస్తు ఉత్తిష్ఠంతు భూతపిశాచాః
ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మసమారభ

ప్రాణాయామం చేసి అందరూ అక్షతలు వెనుకకు వేసుకోవాలి. కుడి చేతితో ముక్కు పట్టుకుని క్రింది ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకోవాలి.

ప్రాణాయామం

ఓ భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః
ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్పం : మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాఙ్ఞేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (ఇక్కడ శ్రీశైలానికి మీ ప్రాంతం ఏ దిక్కున ఉన్నదో చెప్పుకోవాలి) గంగా గోదావరియోర్మధ్యదేశే భగవత్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ….సంవత్సరే .. ఆయనే.. మాసే.. పక్షే.. తిథౌ.. వాసరే.. శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్.. గోత్రః.. (మీ గోత్రం చెప్పుకోవాలి) నామధేయః.. (మీపేరు చెప్పుకోవాలి) ధర్మపత్నీ సమేతస్య మమ సకుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్ధం ధర్మార్ధకామమోక్ష చతుర్విధ పురుషఫలావ్యాప్త్యర్ధం, చింతిత మనోరథ సిద్ధ్యర్ధం, శ్రీసత్యనారాయణస్వామి ముద్దిశ్య శ్రీసత్యనారాయణ స్వామి ప్రీత్యర్ధం అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాంకరిష్యే. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీమహాగణపతి పూజాం కరిష్యే, తదంగ కలశారాధానం కరిష్యే.

కలశారాధన
కలశానికి గంధం, కుంకుమబొట్లు పెట్టాలి. అందులో ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశాన్ని మూసి ఈ మంత్రాన్ని చెప్పాలి.
కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశిత్రాః
కలశస్యముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశిత్రాః

మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద స్సామవేదోహ్యధర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఏవం కలశపూజాః
అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యాలపై, అందరి శిరస్సులపై చల్లాలి.
ఆయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
కలశంలోని జలాన్ని పుష్పంతో దేవుని పైన, పూజాద్రవ్యాలపైన, తమపైన జల్లుకోవాలి. ఆ తర్వాత పసుపు వినాయకునిపై కొద్దికొద్దిగా జలం చల్లుతూ ఈ క్రింది మంత్రాన్ని చదవాలి.
ఓం గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి (అక్షతలు వేయాలి)

(కొద్దికొద్దిగా నీళ్లు పసుపు గణపతిపై చల్లుతూ ఈ పూజ చేయాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు చల్లాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి (గంధం చల్లాలి)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లాలి. ఆపైన పసుపు గణపతిపైన పూలు వేస్తూ ఈ క్రింది స్తుతి చదవాలి)
ఓ సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాలచంద్రాయ నమః, ఓ గజాననాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాలచంద్రాయ నమః, ఓ గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓ శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, ఓం మహా గణాధిపతయే నమః

నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తుల ధూపం చూపించాలి) (పసుపు గణపతికి బెల్లం ముక్క నైవేద్యం పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని చదవాలి) ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యేమధ్యే పానీయం సమర్పయామి (కొద్దిగా నీరు పళ్లెంలో వదలాలి) తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి (తాంబూలం ఇచ్చి, కర్పూరం వెలిగించి స్వామికి చూపించాలి.) ఓం గణానాంపతిం గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా మయాకృత యథాశక్తి పూజయాచ శ్రీమహాగణపతిః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు (గణపతికి నమస్కరించాలి. ఆయన పాదాల వద్ద గల అక్షతలు, పూలు శిరస్సున ధరించాలి. ఆ తరువాత పసుపు గణపతిని కొద్దిగా కదిలించాలి) శ్రీమహాగణాధిపతయే నమః ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి

|| శ్రీమహాగణపతి పూజ సమాప్తం ||

పంచలోక పాలక పూజ

ఆచమనం: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః (నీళ్లను పళ్లెంలో వదలాలి. తదుపరి నమస్కారం చేస్తూ ఈ క్రింది నామాలను పఠించాలి)
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయనమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః
కలశానికి ఎడమవైపున (మీకు కుడివైపున) తమలపాకులు, వక్కలు, అరటిపండు లేదా ఖర్జూరంతో కూడిన తాంబూలాలు ఉంచుతూ ఈ అయిదుగురు దేవతలకు అక్షతలు వేసి నమస్కరించాలి.

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ శ్రీ సత్యనారాయణ
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ శ్రీ సత్యనారాయణ
వ్రతాంగత్వేన గణపత్యాది పంచలోక పాలకపూజాం, ఆదిత్యాది నవగ్రహ పూజాం చ కరిష్యే
ఓం గణపతయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం పరబ్రహ్మణే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం బ్రహ్మాణం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి
ఓం విష్ణవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం విష్ణుం లోకపాలకం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి
ఓం రుద్రవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం రుద్రం లోకపాలకం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి
ఓం గౌర్యైనమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పతీపుత్ర పరివార సమేతాం గౌరీం లోకపాలికాం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి
గణేశాది పంచలోకపాలక దేవాతాభ్యో నమః రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపం ఆఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. (అక్షతలను సమర్పించాలి)

గణేశాది పంచలోక పాలక దేవతాప్రసాద సిద్ధిరస్తు

నవగ్రహ పూజ

కొత్తవస్త్రంపై బియ్యం పరచి కలశం పెట్టుకున్నదే మంటపం. ఆ కలశానికి ఎడమవైపున మీరు పంచలోక పూజ నిర్వహించారు. ఇప్పుడు కలశానికి ముందుభాగంలో తొలిగా సూర్యునికి, ఆయనకు చుట్టూ నవగ్రహాలకు ప్రతీకలుగా తాంబూలాలు సమర్పించాలి. ప్రతి గ్రహానికి ఒక అధిదేవత, ఒక ప్రత్యధిదేవత ఉంటారు. (మొత్తం కలిపి 27 మంది) గ్రహారాధన చేసిన వెంటనే ఆ తాంబూలానికి కుడిపక్కన అధిదేవతకు, ఎడమప్రక్కన ప్రత్యధిదేవతకు తాంబూలం ఉంచాలి. తమలపాకు, వక్క, చిల్లర, అరటిపండు లేదా ఖర్జూరం, ఒక పువ్వు లేదా అక్షింతలతో కూడినదే నవగ్రహ తాంబూలం. తాంబూలం, పువ్వులు, అక్షింతలు భార్య అందిస్తుంటే భర్త మంటపంపై ఉంచి నమస్కరించాలి.

నవగ్రహాలకు తాంబూలం అమర్చాల్సిన తీరు
కేతువు    Ι  గురువు  Ι  బుధుడు
శని       Ι    రవి    Ι  శుక్రుడు
రాహువు Ι  కుజుడు Ι  చంద్రుడు

ఓం సూర్యాయ నమః పత్నీపుత్రపరివారసమేతం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నదికరణే రవిం వర్తులాకార మండలే స్థాపయామి, పూజయామి
ఓం అగ్నయే నమః రవిగ్రహస్య అధిదేవతా అగ్నిం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి
ఓం రుద్రయే నమః రవిగ్రహస్య ప్రత్యధిదేవతా రుద్రం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి
ఓం చంద్రయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం చంద్రగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే స్థాపయామి, పూజయామి
ఓం అప్సుయే నమః చంద్రగ్రహస్య అధిదేవతా అపం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి
ఓం గౌర్యై నమః చంద్రగ్రహస్య ప్రత్యధిదేవతా గౌరీం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి

సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం అంగారక గ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే స్థాపయామి పూజయామి ఓం పృథ్వియే నమః అంగారకగ్రహస్య అధిదేవతా పృథ్వీం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి ఓం క్షేత్రపాలకాయ నమః అంగారకగ్రహస్య ప్రత్యధిదేవతా క్షేత్రపాలకం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి

సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం బుధగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే స్థాపయామి, పూజయామి ఓం విష్ణవే నమః బుధగ్రహస్య అధిదేవతా విష్ణుం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి ఓం క్షేత్రపాలకాయ నమః బుధగ్రహస్య ప్రత్యధిదేవతా నారాయణం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి

సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం గురుగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే స్థాపయామి, పూజయామి ఓం బ్రహ్మణే నమః గురుగ్రహస్య అధిదేవతా బ్రహ్మాణం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి ఓం ఇంద్రయే నమః గురుగ్రహస్య ప్రత్యధిదేవతా ఇంద్రం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి

సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శుక్రగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య ప్రాక్ భాగే స్థాపయామి పూజయామి ఓం ఇంద్రాణ్యై నమః శుక్రగ్రహస్య అధిదేవతా ఇంద్రాణీం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి ఓం ఇంద్రమరుత్వంతయే నమః శుక్రగ్రహస్య ప్రత్యధిదేవతా ఇంద్రమరుత్వంతం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి

సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం శనైశ్చర గ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే స్థాపయామి పూజయామి ఓం యమాయ నమః శనిగ్రహస్య అధిదేవతా యమం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి ఓం ప్రజాపతయే నమః శుక్రగ్రహస్య ప్రత్యధిదేవతా ప్రజాపతిం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి

సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం రాహుగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య నైరుతీ దిగ్భాగే స్థాపయామి పూజయామి ఓం గాం నమః రాహుగ్రహస్య అధిదేవతా గాం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి ఓం సర్పయే నమః రాహుగ్రహస్య ప్రత్యధిదేవతా సర్పం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి ఓం చిత్రగుప్తవే నమః కేతుగ్రహస్య అధిదేవతా చిత్రగుప్తం ఆవాహయామి దక్షిణతః స్థాపయామి పూజయామి ఓం బ్రహ్మణే నమః కేతుగ్రహస్య ప్రత్యధిదేవతా బ్రహ్మాణం ఆవాహయామి ఉత్తరతః స్థాపయామి పూజయామి

సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్రపరివారసమేతం కేతుగ్రహం ఆవాహయామి, సూర్యగ్రహస్య వాయవ్య దిగ్భాగే స్థాపయామి, పూజయామి అధిదేవతా ప్రత్యధిదేవాతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవాతాభ్యో నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. (అక్షతలను సమర్పించాలి)

అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్తు

అష్టదిక్పాలక పూజ

మంటపం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ తాంబూలాలను ఉంచుతూ అష్టదిక్పాలకులను పూజించాలి.
ఓం ఇంద్రవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ప్రాగ్దిగ్భాగే ఇంద్రం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి
ఓం అగ్నయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఆగ్నేయ దిగ్భాగే అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి
ఓం యమాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం దక్షిణ దిగ్భాగే యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి
ఓం నిరుతయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం నైరుతి దిగ్భాగే నిరుతిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి
ఓం వరుణయే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం పశ్చిమ దిగ్భాగే వరుణం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి
ఓం వాయవే నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం వాయవ్య దిగ్భాగే వాయుం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి
ఓం కుబేరాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఉత్తర దిగ్భాగే కుబేరం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజమామి
ఓం ఈశానాయ నమః సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీపుత్ర పరివార సమేతం ఈశాన దిగ్భాగే ఈశానం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి
ఇంద్రాద్రి అష్టదిక్పాలక దేవతాభ్యోనమః ధ్యాయామి ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. (అక్షతలను సమర్పించాలి)

ఇంద్రాది అష్టదిక్పాలక దేవతా ప్రసాదసిద్ధిరస్తు

సత్యనారాయణ స్వామి పూజ

శ్రీసత్యనారాయణస్వామి ప్రతిమను తమలపాకుపై ఉంచి ముందుగా పంచామృతాలతో శుద్ధి చేయాలి.
పాలు: ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్ణియం భవా వాజస్య సంగథే.
పెరుగు: దధిక్రావుణ్ణో అకారిషం, జిష్ణోరశ్వస్యవాజినః సురభినో ముఖాకరత్ర్పణ ఆయూగం షితారిషత్.
నెయ్యి: శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యస్య రశ్మిభిః.
తేనె: మధువాతా ఋతాయతే మధు క్షరంతి సింధవః మాధ్వీస్సంత్వోషధీః మధుసక్తముతోసి మధుమత్సార్థివగ్ం రజః మధుద్యౌరసునః పితా, మధుమాన్నో వనస్పతిః మధుమాగ్ం అస్తు సూర్యః, మాధ్వీర్గావో భవంతు నః
శుద్ధోదకం (నీటిని పోస్తూ) : స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగం అదాభ్యః

శుద్ధోదకస్నానం (నీటితో స్వామికి స్నానం) : ఆపోహిష్ఠా మయోభువ స్తాన ఊర్జేదధాతన, మహేరణాయ చక్షసే యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః ఉశతీరివమాతరః, తస్మా అరంగమామవో యస్యక్షయాయ జిన్వథ, ఆపోజనయథాచనః

ప్రాణాప్రతిష్ఠాపనం
ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః, ఋగ్యజుస్సామాధర్వణాని ఛందాంసి, ప్రాణశ్శక్తిః, పరాదేవతా హ్రాం బీజం, హ్రీం శక్తిః, క్రోం కీలకం శ్రీ సత్యనారాయణ ప్రాణప్రతిష్ఠా జపే వినియోగః
కరన్యాసమ్ (మంత్రవిధి తెలిసిన వారికి మాత్రమే, ఇతరులకు వర్తించదు)
హ్రాం అంగుష్ఠాభ్యాం నమః హ్రీం తర్జనీభ్యాం నమః హ్రూం మధ్యమాభ్యాం నమః హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః హ్రః కరతలకర పృష్ఠాభ్యాం నమః హ్రైం అనామికాభ్యాం నమః.
అంగన్యాసమ్ (మంత్రవిధితెలిసిన వారికి మాత్రమే,ఇతరులకు వర్తించదు)
హ్రాం హృదయాయ నమః హ్రీం శిరసే స్వాహా హ్రూం శిఖాయై వషట్ హ్రైం కవచాయ హుం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ హ్రః అస్త్రాయ ఫట్ భూర్భువస్సువరోమితి దిగ్బంధః

స్వామివారికి షోడశోపచార పూజలు

ధ్యానం : ధ్యాయేత్సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం, లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం శ్రీసత్యనారాయణ స్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
ఆవాహనం : ఓం సహస్రశీర్షాపురుషః సహస్రాక్షస్సహస్రపాత్ సభూమిం విశ్వతోవృత్వా అత్యతిష్ఠ ద్దశాంగులమ్ జ్యోతిశ్శాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగిహృద్ధ్యానగమ్యం సాంగం సశక్తిం సాయుధం భక్తిసేవ్యం సర్వాకారం విష్ణుం ఆవాహయామి.
ఆసనం : ఓం పురుష ఏ వేదగ్ం సర్వం యద్భూతం యచ్ఛభవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతి రోహతి కల్పద్రుమ మూలే మణివేదిమధ్యే సింహాసనే స్వర్ణమయం విచిత్రం విచిత్రవస్త్రావృతం అచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమన్విత శ్రీ సత్యనారాయణస్వామినే నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి.
పాద్యం : ఏతావానస్య మహిమా అతోజ్యాయాగ్ శ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని, త్రిపాదస్యామృతం దివి నారాయణ నమస్తేస్తు నరకార్ణవతారక పాద్యం గృహాణ దేవేశ మమ సౌఖ్యం వివర్ధయ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పాదయోః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం : త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః, పాదోస్యేహాభవాత్పునః తతోవిష్పజ్ వ్యక్రామత్ సాశనానశనే అభి వ్యక్తావ్యక్త స్వరూపాయ హృషీకపతయే నమః మయా నివేదితో భక్త్యాహి అర్ఘ్యోయం ప్రతిగృహ్యతాం శ్రీ సత్యనారాయణస్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
ఆచమనీయం : తస్మాద్విరాడజాయత విరాజో అధిపూరుషః స జాతోత్యరిచ్యత పశ్ఛాద్భూమి మధోపురః మందాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభం తదిదం కల్పితం దేవసమ్యగాచమ్యతాం విభో శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి
స్నానం : యత్పురుషేణ హవిషా దేవా యఙ్ఞ మతస్వత, వసంతో స్యాసీదాజ్యం గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః. తీర్థోదకైః కాంచనకుంభస్థితైః సువాసితై ర్దేవ కృపారసార్ద్ైః మయార్పితం స్నానవిధిం గృహాణ పాదాబ్జ నిష్ఠ్యూత నదీప్రవాహ శ్రీ సత్యనారాయణస్వామినే నమః స్నపయామి

పంచామృతస్నానం

(పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీరు కలుపరాదు విడివిడిగా స్వామి స్నానానికి వాడాలి.)
(పాలు) ఆప్యాయస్వ సమేతు తే విశ్వత స్సోమ వృష్ణియం. భవా వాజస్య సంగధేః (పెరుగు) దధిక్రాపుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషత్: (నెయ్యి) శుక్రమసి జ్యోతిరసితేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః (తేనె) మధువాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః మాధ్నీర్నస్సంత్వోషధీః మధుసక్తముతోషి మధుమత్పార్ధివగ్ం రజః మధు ద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః (మంచినీరు) స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. స్నానం పంచామృతైర్దేవ గృహాణ పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతిప్రియ. శ్రీ సత్యనారాయణస్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి.
శుద్ధోదకస్నానం (నీటితో స్నానం)
ఆపోహిష్ఠా మయోభువస్తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యోవశ్శివతమోరసస్తస్య భాజయతేహనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్యక్షయాయ జిన్వథ ఆపోజనయథాచనః. నదీనాం చైవ సర్వాసమానీతం నిర్మలోదకం స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర శ్రీ సత్యనారాయణస్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
వస్త్రం (కుంకుమ అద్దిన దూదిని సమర్పించాలి)
సప్తాస్యాసన్పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః దేవాయద్యఙ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామ సమన్వితే సర్వవర్ణప్రదే దేవ వాససీ తే వినిర్మితే శ్రీ సత్యనారాయణస్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం (కుంకుమ అద్దిన దూదిని పెట్టుకోవచ్చు.)
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చయే బ్రహ్మ విష్ణు మహేశానం నిర్మితం బ్రహ్మసూత్రకం గృహాణ భగవాన్ విష్ణోః సర్వేష్టఫలదో భవ శ్రీ సత్యనారాయణస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధం
తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశూగ్ స్తాగ్ శ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీఖండం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ సత్యనారాయణస్వామినే నమః దివ్యశ్రీచందనం సమర్పయామి
ఆభరణం (అక్షింతలు సమర్పించవచ్చు)
తస్మాద్యజ్ఞా త్సర్వ హుతః ఋచస్సామానిజజ్ఞిరే ఛందాగ్ం సి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత హిరణ్య హార కేయూర గ్రైవేయ మణికంకణైః సుహారం భూషణైర్యుక్తం గృహాణ పురుషోత్తమ శ్రీ సత్యనారాయణస్వామినే నమః ఆభరణం సమర్పయామి.
పుష్పం
తస్మాద్వా అజాయంత యేకే చోభయా దతః గావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాజ్ఞాతా అజావయః మల్లికాది సుగంధీని మాలత్యాదీని వై ప్రభో మయాహృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతాం
శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి.

అథాంగపూజ
ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి
ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి
ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి
ఓం అనఘాయ నమః జానునీ పూజయామి
ఓం జనార్దనాయ నమః ఉరుం పూజయామి
ఓం విష్టరశ్రవసే నమః కటిం పూజయామి
ఓం కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరం పూజయామి
ఓం శంఖచక్రగదాశార్జ్గపాణయేనమః బాహూన్ పూజయామి
ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి
ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి
ఓం కుందకుట్మలదంతాయ నమః దంతాన్ పూజయామి
ఓం నాసాగ్రమౌక్తికాయ నమః నాసికాం పూజయామి
ఓం సూర్యచంద్రాగ్ని ధారిణే నమః నేత్రౌ పూజయామి
ఓం సహస్రశిరసే నమః శిరః పూజయామి
ఓం శ్రీ సత్యనారాయణస్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి
ఒకరు ఈ నామాలను చదుతుండగా మిగిలిన వారు స్వామిని ధ్యానించుకోవాలి.

శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామపూజ

ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం శౌరయే నమః, ఓం చక్రపాణయే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం వాసుదేవాయ నమః,
ఓం జగద్యోనయే నమః, ఓం వామనాయ నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీవల్లభాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం చతుర్మూర్తయే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం ఆత్మజ్యోతిషే నమః, ఓం శ్రీవత్సాంకాయ నమః, ఓం అఖిలాధారాయ నమః, ఓం సర్వలోకప్రభవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రికాలజ్ఞానాయ నమః, ఓం త్రిధామ్నే నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వగాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వేశాయ నమః, ఓం సర్వసాక్షికాయ నమః, ఓం హరిణే నమః, ఓం శార్ఙ్గినే నమః, ఓం హరయే నమః, ఓం శేషాయ నమః, ఓం హలాయుధాయ నమః, ఓం సహస్రబాహవే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం క్షరాయ నమః, ఓం గజారిఘ్నాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం స్వయంభువే నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం దేవకీపుత్రాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం పార్థసారథయే నమః, ఓం అచంచలాయ నమః, ఓం శంఖపాణయే నమః, ఓం కేశిమర్దనాయ నమః, ఓం కైటభారయే నమః, ఓం అవిద్యారయే నమః, ఓం కామదాయ నమః, ఓం కమలేక్షణాయ నమః, ఓం హంసశత్రవే నమః, ఓం అధర్మశత్రవే నమః, ఓం కాకుత్థ్సాయ నమః, ఓం ఖగవాహనాయ నమః, ఓం నీలాంబుద ద్యుతయే నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిత్యానందదాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం నిర్వకల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం పృథ్వీనాథాయ నమః, ఓం పీతవాససే నమః, ఓం గుహాశ్రయాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభవే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీమతే నమః, ఓం త్రైలోక్యభూషణాయ నమః, ఓం యజ్ఞమూర్తయే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం వరదాయ నమః, ఓం వాసవానుజాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం సమదృష్టయే నమః, ఓం సనాతనాయ నమః, ఓం భక్తప్రియాయ నమః, ఓం జగత్పూజ్యాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం అసురాంతకాయ నమః, ఓం సర్వలోకానామంతకాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంతవిక్రమాయ నమః, ఓం మాయాధారాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం ధరధరాయ నమః, ఓం నిష్కళంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిష్ప్రపంచాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం భక్తవశ్యాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం పుణ్యకీర్తయే నమః, ఓం పురాతనాయ నమః, ఓం త్రికాలజ్ఞాయ నమః, ఓం విష్టరశ్రవసే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం శ్రీ సత్యనారాయణస్వామియే నమః
నానావిధ పరిమళ,పత్ర,పుష్ప పూజాం సమర్పయామి.
ఇక్కడ అందరూ అక్షింతలు, పూలు స్వామివారికి సమర్పించాలి.
ధూపం (అగరుబత్తి వెలిగించాలి)
యత్పురుషం వ్యదధుః కతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూకా పూరూ పాదావచ్యేతే దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్కృత శ్రీ సత్యనారాయణస్వామినే నమః ధూపమాఘ్రపయామి.
దీపం (దీపం స్వామికి చూపాలి)
బ్రాహ్మణోస్యముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో అజాయత ఘృతాక్తవర్తిసంయుక్తం వహ్నినా యోజితం ప్రియం దీపం గృహాణ దేవేశ త్రైలోక్య తిమిరాపహమ్ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.
నైవేద్యం (పళ్లు, కొబ్బరికాయలు వంటివి నివేదించాలి)
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించయామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా శ్రీ సత్యనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

శ్రీసత్యనారాయణస్వామి వ్రతకథ

శ్రీసత్యనారాయణ స్వామి వ్రతకథ అయిదు అధ్యాయాలుగా ఉంటుంది. ఈ కథను ఒకరు చదువుతుండగా మిగిలిన వారు వినాలి. వ్రతంలో పాల్గొంటున్న అందరికీ అక్షతలు అందించాలి. కథలన్నీ పూర్తయ్యేవరకు అందరూ అక్షతలను చేతిలో ఉంచుకోవాలి.

1
ప్రథమాధ్యాయం ప్రారంభం

శ్రీకరమైన నైమిశారణ్యమది. దీర్ఘసత్రయాగం జరుగుతున్న ప్రాంతమది. అక్కడే వేదవ్యాసుని ప్రత్యక్ష శిష్యుడైన వైశంపాయనుని అనుంగు శిష్యుడు…. సూతమహర్షి ఎన్నో పురాణ గాథలను వినిపించాడు. శౌనకాది మునులు వాటిని శ్రద్ధగా విని తరించి జాతికి అందించారు. ఒకనాడు శ్రీసూత మహర్షిని శౌనకాది మహామునులు దర్శించుకొని కొన్ని సందేహాలను వెలిబుచ్చారు.
ఓ పౌరాణిక బ్రహ్మా! సూత మహర్షీ! మానవులు ఏవ్రతం చేసినట్లైతే కోరిన కోరికలు ఫలించి ఇహపర లోకసిద్ధి పొందుతారో, ఏ తపస్సు చేసినట్లైతే లబ్ధి పొందుతారో తెలియజేయండని ప్రార్థించారు.
అది విన్న సూతుడు, ‘‘ఓ మునిశ్రేష్ఠులారా! పూర్వం ఒకసారి శ్రీమహావిష్ణువును నారదుడు ఇప్పుడు మీరడిగినట్లే అడిగాడు. అందుకు శ్రీమహావిష్ణువు స్వయంగా నారదమహర్షికి చెప్పినదానినే మీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి’’ అన్నాడు.
నారదుడు జగత్ కల్యాణం కోసం లోకసంచారం చేస్తూ ఓరోజు భూలోకానికి వచ్చాడు. పూర్వజన్మ కర్మఫలం వల్ల పలుజన్మలను ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తున్న మానవులను చూచి జాలిపడ్డాడు. వారి కష్టాలు కడతేరే ఉపాయమేది అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్లాడు. అక్కడ చతుర్భుజుడు, తెల్లని శరీరం గలవాడు, శంఖ చక్ర గదా పద్మవనమాల విభూషితుడు అయిన నారాయణుని చూచి ఇలా స్తుతించాడు. మనస్సుకు, మాటలకు, ఊహకు అలవికాని దివ్యరూపం కలవాడా! ఆదిమధ్యాంత రహితుడా! నిర్గుణా! సుగుణాత్మకా! ఆదిపురుషా! భక్తుల బాధలను తీర్చే శ్రీమన్నారాయణా! నీకు నమస్కారము.
ఆ స్తోత్రాన్ని విన్న శ్రీమహావిష్ణువు సంతోషించి నారదునితో, ‘‘ఓ మహర్షీ! నీరాకకు కారణమేమిటి? నీ కోరిక ఏమిటో చెప్పు’’ అన్నాడు.
అందుకు నారదుడు, ‘‘ఓ లక్ష్మీవల్లభా! శ్రీమన్నారాయణా! జగద్రక్షకా! భూలోకంలో జనులందరూ బహుజన్మలతో పాపకర్మలను అనుభవిస్తున్నారు. వారి కష్టాలు కడతేర్చే ఉపాయమేదైనా చెప్పి, దయతో అనుగ్రహించు’’ అని ప్రార్ధించాడు.
అప్పుడు శ్రీమహావిష్ణువు ‘‘నారదా! లోకక్షేమం కోరి మంచి విషయాన్నడిగావు. మానవులు సంసార భ్రాంతిని వదలి సుఖసంతోషాలను పొందే సులభ ఉపాయాలను చెబుతాను విను. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభము, మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. నీపై వాత్సల్యంతో దాన్నే ఇప్పుడు చెబుతున్నాను. అదే శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినవారు సర్వసుఖాలను, మోక్షాన్ని పొందుతారు’’ అన్నాడు.
అందుకు నారదుడు, ‘‘మహాప్రభూ! ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఆచరించే విధానమేది? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి
ఫలితం పొందినవారెవరైనా ఉన్నారా? ఎప్పుడు ఆచరించడం శ్రేష్ఠం తదితర వివరాలన్నీ నాకు తెలియచేయండి’’ అని కోరాడు.
శ్రీమహావిష్ణువు సత్యనారాయణ వ్రతమహత్యాన్ని నారదునికి ఇలా వివరించాడు. ఈ వ్రతం కష్టనష్టాలను, విచారాన్ని పోగొడుతుంది. ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది. సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్ర విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ, వైశాఖ, కార్తిక మాసాల్లో గాని ఏదైనా శుభదినంలో గాని ఆచరించాలి. కార్యవిజయానికి, కష్టాలు తీరడానికి, దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలి. శక్తి గలిగినవారు ప్రతినెలా వ్రతం చేయవచ్చు. వీలుకాని పక్షంలో శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చు.
ఏకాదశి రోజునగాని , పౌర్ణమి రోజునగాని, సూర్యసంక్రమణం రోజునగాని, సత్యనారాయణ వ్రతం చేయవచ్చు. చేసేరోజున సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. కాలకృత్యాలను తీర్చుకున్న తరువాత, స్నానం చేసి శుచిగా భగవంతునికి నమస్కరించి ‘స్వామీ సత్యనారాయణా! నీ అనుగ్రహప్రాప్తికోసం భక్తిశ్రద్ధలతో నేను నీ వ్రతం ఆచరిస్తున్నాను. నాపై దయ చూపు’ అంటూ నిశ్చలభక్తితో భగవంతుని ధ్యానించాలి.
ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తరువాత మధ్యాహ్నవేళ కూడా సంధ్యావందనాదికాలను నెరవేర్చుకోవాలి. సాయంకాలం స్నానం పూర్తయ్యాక, ప్రదోషకాలం (అసుర సంధ్యవేళ) దాటిన తరువాత వ్రతం ఆరంభించాలి.
ముందుగా పూజాప్రదేశంలో స్థలశుద్ధి చేయాలి. చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా అయిదు రంగుల పొడులతో అందమైన, శుభకరమైన ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రాన్ని పరచి ఉంచాలి. ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి, రాగి, ఇత్తడి కలశాల్లో ఏదో ఒకటి ఉంచవచ్చు. మట్టి కలశం సైతం ఉంచవచ్చు. శక్తి ఉండి లోభత్వం చూపకూడదు. విధివిధానంగా సమస్తం ఆచరించాలి.
కలశానికి సమీపంలో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి పూజించాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు) శుద్ధి చేసి మంటపంలో ఉంచాలి. ప్రథమంగా విఘ్నేశ్వరుని, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని , శివ పార్వతులను, నవగ్రహాలను అధిదేవతలు, ప్రత్యధిదేవతలతో సహా పూజించాలి. అష్టదిక్పాలకులను పూజించాలి. వారిని ముందుగా ఆవాహన చేయాలి.
మొదట కలశపూజ చేయాలి. వరుణదేవుని ఆవాహన చేసి పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మొదలైన పంచపాలకులు అయిదుగురినీ కలశంలోకి ఆవాహన చేయాలి. ఉత్తరదిశలో, మంత్రాలతో ఉదకసహితంగా ఆవాహనం చేసి పూజించాలి. సూర్యాదిగ్రహాలను, దిక్పాలకులను ఆయా స్థానాల్లోకి ఆవాహన చేసి పూజించాలి. ఆ తరువాత సత్యనారాయణస్వామిని ప్రతిష్టించి పూజించాలి. అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన ఎనిమిది దిశల్లో ప్రతిష్టించి పూజించాలి. ఆ తరువాత సత్యదేవుని పూజించాలి.
భక్తిశ్రద్ధలతో ఏ రోజైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. కాని పగలు ఉపవాసం ఉండి సాయంసమయంలో సత్యనారాయణస్వామిని పూజించడం మంచిది. ఈ వ్రతాన్ని అందరూ బంధువులతో కలిసి చేసుకోవచ్చు. గోధుమ నూకలో గాని, వరినూకలోగాని అరటిపళ్లు, ఆవుపాలు, ఆవునెయ్యి పంచదార లేదా బెల్లం కలిపి ప్రసాదం తయారుచేసి స్వామికి నివేదించాలి.
ఇలా స్వామికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సత్యనారాయణ స్వామిని నృత్యగీతాది మహారాజోపచారములతో సంతుష్టుని చేయాలి. కలియుగంలో భూలోక మానవులు తమ కామితార్ధాలను తీర్చుకొనేందుకు సులభమైన వ్రతమార్గమిదే. మానవులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఇంతకంటే సులభవ్రతమార్గం ఇంకొకటిలేదు – అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించాడని సూతమహర్షి శౌనకాదిమునులకు బోధించాడు.

|| ప్రథమాధ్యాయం సంపూర్ణం ||

ప్రతి అధ్యాయానికి చివరిలో….. ఎవరో ఒకరు కొబ్బరికాయ, అరటిపళ్లు, బెల్లం నివేదించాలి. ఆ సమయంలో వాటిపై కొద్దిగా నీళ్లు చిలకరించి స్వామికి చూపిస్తూ ఈ దిగువ మంత్రాన్ని చదవాలి.
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించయామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా శ్రీ సత్యనారాయణ స్వామినే నమః కదళీఫల నారికేళ సహిత గుడోపహారాన్ సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.

2
ద్వితీయాధ్యాయo ప్రారంభం

సూతమహర్షి శౌనకాదిమునులకు చెబుతున్నాడు. ఓ మునులారా! పూర్వం శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన వారిని గురించి చెబుతాను వినండి. కాశీనగరంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రబాధ ననుభవిస్తూ అన్నవస్త్రాలకు సైతం లేక పడరానిపాట్లు పడుతుండేవాడు. ఒకనాడు భగవంతుడు అతనిపై దయతలచి, వృద్ధవేషం ధరించి ఎదుట నిలిచి, “ఓయి విప్రోత్తమా! నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుతున్నావు? నీ వృత్తాంతమంతా చెప్పవలసింద”న్నాడు.
అంతట బ్రాహ్మణుడు, ‘‘ఓ మహాత్మా! నేను మిక్కిలి దరిద్రుడనై భిక్షాటనంతో జీవిస్తున్నాను. పడరాని పాట్లుపడుతూ ఇంటింటికీ తిరుగుతున్నాను. నా దరిద్రం పోయే మార్గమేదైనా ఉంటే చెప్పి చేయూతనివ్వండి స్వామీ” అని వేడుకున్నాడు. అప్పుడు వృద్ధుని వేషంలోని భగవంతుడు, “ఓ ద్విజోత్తమా! శ్రీసత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే గదా! ఆ స్వామిని పూజించు. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి’’ అంటూ వ్రత విధానం వివరించి అక్కడే అదృశ్యుడయ్యాడు. ఆ వృద్ధుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రేపు చేసుకుంటానని బ్రాహ్మణుడు సంకల్పించుకొన్నాడు. దాన్నే తలుచుకొంటూ నిద్ర పట్టనివాడై తెల్లవారుజామునే లేచి, “ఈ రోజు తప్పకుండా సత్యనారాయణవ్రతం చేసుకొంటానని” మళ్లీ సంకల్పం చెప్పుకున్నాడు. యధావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయవల్ల ఆ రోజున బ్రాహ్మణునికి చాలా ద్రవ్యం లభించింది. దానితో అతడు బ్రాహ్మణులను, బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాడు.
ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దరిద్ర బాధలు తీరి, సకలసంపదలతో విలసిల్లాడు. ప్రతినెలా విడువకుండా సత్యనారాయణస్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించసాగాడు. క్రమేపీ అతనికి మహదైశ్వర్యం పట్టింది. సర్వపాపాల నుంచి విముక్తి పొందాడు. మరణానంతరం మోక్షం పొందాడు. భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతం చేసినట్లైతే వారి సర్వదుఃఖాలు తొలగి సుఖసంతోషాలతో ఉండగలరు. ఓ మునులారా! ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారదమహర్షికి చెప్పిన వ్రతాన్ని మీకు తెలియచేశాను అని సూతమహర్షి చెప్పాడు.
అప్పుడు ఋషులు మళ్లీ, “ఓ మహర్షీ! ఆ బ్రాహ్మణుని వల్ల విన్నవారెవరైనా ఈవ్రతాన్ని ఆచరించారా! చెప్పండి మాకు వినాలని ఉంది” అని సూతమహర్షిని అడిగారు.
సూతమహర్షి చెబుతున్నాడు “మునులారా! ఆ బ్రాహ్మణుడు ఒకరోజు తన శక్తికొద్దీ బంధుమిత్రులను పిలుచుకుని వ్రతం చేయనారంభించాడు. అంతలో ఒక కట్టెలమ్ముకొనేవాడు అక్కడికి వచ్చి కట్టెలమోపును బయట దింపుకొని, లోపలికివచ్చి వ్రతాన్ని చూడసాగాడు. బ్రాహ్మణుడు చేస్తున్న వ్రతాన్నంతా ఓపికతో చూసి దేవునికి, బ్రాహ్మణునికి నమస్కారం చేసి, “ఓ బ్రాహ్మణోత్తమా! మీరిప్పుడు చేసిన పూజ పేరేమి? దానివలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని” అర్ధించాడు.
విప్రుడిలా చెప్పాడు. ‘‘ఓయీ! ఇది సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతం చేస్తే సర్వకార్యసిద్ధి కలుగుతుంది. కోరిన కోరికలు ఫలిస్తాయి. సకలైశ్వర్యవంతులు కావచ్చు.’’ ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్దగా విన్న ఆ కట్టెలమ్మేవాడు చాలా సంతోషించి, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి తన ఇంటికి వెళ్లాడు. అతడు సత్యనారాయణ స్వామినే మనసులో ధ్యానిస్తూ వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు. ఈ కట్టెల మోపును అమ్మితే వచ్చే ధనంతో సత్యనారాయణ వ్రతం చేయాలని తలచాడు. అతడు కట్టెలను అమ్మటానికి మరుసటి దినం నగరంలో ధనవంతులున్న ఇళ్లవైపు వెళ్లాడు. స్వామి అనుగ్రహం చేత అతనికానాడు రెట్టింపు లాభం వచ్చింది. దానికతడు సంతోషించి అరటిపళ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమనూక, పూజాసామాగ్రినంతటిని తీసుకొని ఇంటికి పోయాడు. బంధువులందరినీ పిలిచి శ్రద్ధగా సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యాలతో, పుత్రపౌత్రాదులతో సర్వసంపదలు కలిగినవాడై సకల సౌఖ్యాలూ అనుభవించి అంత్యకాలంలో సత్యలోకం చేరుకున్నాడు.

|| ద్వితీయాధ్యాయం సంపూర్ణం ||

3
తృతీయాధ్యాయం ప్రారంభం

సూతుడు మరో కథను చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఓ మునులారా! పూర్వం ఉల్కాముఖుడనే రాజుండేవాడు. అతడు ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. ప్రతిదినం దేవాలయానికి వెళ్లేవాడు. ఆ రాజొకనాడు ధర్మపత్నీ సమేతుడై భద్రశీలా నదీతీరంలో సత్యనారాయణవ్రతం చేస్తున్నాడు. ఇంతలో సాధువనే ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడు. అపారమైన ధనరాశులతో, వస్తువులతో ఉన్న నావను తీరాన నిలిపి వ్రతం చేస్తున్న రాజును సమీపించి, వినయంతో ఇలా అడిగాడు.
‘‘ఓ రాజా! భక్తిశ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి. తెలుసుకోవాలనుంది’’ అని అడిగాడు. అంతట రాజు, ‘‘ఓ సాధూ! పుత్రసంతానప్రాప్తి కోసం మేము ఈ సత్యనారాయణవ్రతం చేస్తున్నాం’’ అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు ‘‘ఓ రాజా! నాకు కూడా సంతానంలేదు. ఈ సత్యనారాయణ వ్రతం చేస్తే సంతానం కలుగుతుదంటే నేనూ ఈ వ్రతం చేస్తాన’’న్నాడు. తరువాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్యయైన లీలావతితో సత్యనారాయణ వ్రతాన్ని గురించి చెప్పాడు. ఇద్దరూ కలిసి తమకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరించాలని సంకల్పించుకున్నారు.
కొంతకాలానికి లీలావతి గర్భవతి అయింది. పదోమాసంలో పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రునివలె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. తల్లిదండ్రులామెకు కళావతి అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి, ‘‘నాథా! మనకు సంతానం కలిగితే సత్యనారాయణవ్రతం చేయాలనుకున్నాం గదా! మనకు పుత్రిక ఉదయించింది గదా! కనుక వ్రతంచేయండి’’ అని భర్తకు చెప్పింది. దానికా వర్తకుడు, ‘‘లీలావతీ! మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామ’’ని భార్యను సమాధానపరిచాడు. వ్యాపారం పనిమీద నగరానికి పోయాడు.
కళావతి క్రమంగా యుక్త వయస్సుకు చేరుకుంది. తండ్రి అయిన సాధు వర్తకుడు తన సహచరులతో ఆలోచించి కళావతికి వరుని వెతికేందుకు దూతను పంపాడు. ఆ దూత దేశసంచారం చేసి, కాంచన నగరం నుంచి యోగ్యుడైన పెళ్లికొడుకును వెంట పెట్టుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశ్య బాలకుని చూసిన సాధువు తన కుమార్తె నిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయి పెళ్లివేడుకల్లో ఆనందిస్తూ సాధువు సత్యనారాయణ వ్రతాన్ని మరిచాడు.
కొంతకాలం గడిచింది, వ్యాపారదక్షతగల సాధువు వ్యాపారం కోసం అల్లునితో సహా విదేశాలకు బయలుదేరి వెళ్లాడు. చంద్రకేతుడనే మహారాజు పరిపాలనలో ఉన్న రత్నసానుపురం అనే నగరాన్ని వాళ్లిద్దరూ చేరుకున్నారు.
దురదృష్టవశాత్తూ అదేరోజున రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డారు. వారిని రాజ భటులు తరుముతుండగా సాధువు, ఇతర వర్తకులు ఉన్నవైపుకు దొంగలు పరుగెత్తుకుని వచ్చారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనాన్ని సాధువు ఉన్నచోట పారవేసి వెళ్లిపోయారు. రాజభటులు వచ్చి, వర్తకుల వద్దనున్న రాజధనాన్ని చూసి, ఆ వర్తకులే దొంగలని నిశ్చయించుకొన్నారు. సాధువును, అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకుపోయారు. ఆ రాజభటులు, ‘‘మహారాజా! ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకొనివచ్చాం. విచారించి శిక్షించండి’’ అని చెప్పారు.
అంతట చంద్రకేతు మహారాజు, విచారణ అవసరం లేదంటూ ‘‘వీరిని చెరసాలలో బంధించండి’’ అని భటులను ఆజ్ఞాపించాడు. వర్తకులెంత మొత్తుకున్నా, వారినెవ్వరూ పట్టించుకోలేదు. భటులు వారిని కారాగారంలో బంధించారు. అది చాలదన్నట్లుగా చంద్రకేతు మహారాజు వర్తకుల పడవల్లో ఉన్న ధనం కూడా దొంగసొమ్ము అయివుండవచ్చని భావించి, తన ధనాగారానికి చేర్పించాడు. సాధువు చెరసాలలో మగ్గుతున్న కాలంలోనే ఇంటివద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాలపాలయ్యింది. వారి ఇంటిలో దొంగలుపడి సంపదనంతా దోచుకుపోయారు. లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలైంది. తినటానికి తిండిలేక, ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని బతక సాగింది. కుమార్తె కళావతి కూడా తల్లితోపాటు బిచ్చమెత్తుకోసాగింది. అలా ఒకనాడు భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఒక ఇంటిలో సత్యనారాయణ వ్రతం చేస్తుండగా కళావతి చూసింది. వ్రతం, వ్రతకథ పూర్తయ్యేదాకా విని, కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లుచేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి కోపించి, ‘‘అమ్మాయీ! ఇంతరాత్రి వరకు ఎక్కడున్నావు?’’ అని నిలదీసింది. అందుకు కళావతి, “అమ్మా! నేనొక ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మా! ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందట గదా!” అని అడిగింది.
లీలావతి కుమార్తె మాటలు విని, ‘‘అమ్మాయీ! నువ్వు పుడితే సత్యనారాయణ వ్రతం చేస్తామని మీ తండ్రిగారు గతంలో మొక్కుకున్నారు. ఆ వ్రతాన్ని నేటివరకు చేయకపోవడం వల్లనే మనకు ఈ కష్టాలు వచ్చిపడ్డాయి. మన కష్టాలు తీరడానికి తరుణోపాయం మనం వ్రతం చేయడమే’’ అంటూ అప్పటికప్పుడే వ్రతం సంకల్పించింది.
వర్తకుని భార్యయైన లీలావతి, కుమార్తె కళావతి కలిసి, ఉన్నంతలో మిక్కిలి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేశారు. ‘‘స్వామీ! మా అపరాధం మన్నించండి. మమ్మల్ని క్షమించి నా భర్త, అల్లుడు సుఖంగా ఇల్లు చేరేలా దీవించండి’’ అని ప్రార్ధించింది.
లీలావతి చేసిన వ్రతానికి సత్యదేవుడు సంతోషించి ఆరాత్రి చంద్రకేతుమహారాజు కలలో కనిపించాడు. ‘‘రాజా! నీవు బంధించిన వారిద్దరూ దొంగలుకారు. వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరినీ విడిపించి, వారి ధనం వారికిచ్చి పంపివేయి’’ అని ఆజ్ఞాపించాడు. మరునాడు ఉదయాన్నే రాజు సభ తీర్చాడు. గతరాత్రి తాను చూసిన స్వప్నాన్ని అందరికీ వివరించాడు. ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆఙ్ఞాపించాడు. భటులు తీసుకువచ్చిన వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలుచున్నారు.
రాజు వర్తకులను చూసి, “వర్తక శ్రేష్ఠులారా! మీకీ ఆపద దైవవశమున సంభవించినది. భయపడకండి” అని ఓదార్చి వారిని బంధవిముక్తులను చేశాడు. వారిని నూతన వస్త్రములతో సత్కరించాడు. ఇంకా అనేక విధాల వారిని గౌరవించి, వారి వద్దనుంచి స్వాధీనం చేసుకొన్న ధనానికి రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ సంతోషపరిచాడు. సకలమర్యాదలతో వారినీ సాగనంపాడు. వర్తకులు పరమానందభరితులై పడవనెక్కి రత్నపురానికి బయలుదేరారు.

|| తృతీయాధ్యాయం సంపూర్ణం ||

4
చతుర్థాధ్యాయం ప్రారంభం

సూతమహర్షి చెబుతున్నాడు. చంద్రకేతు మహారాజు చెరనుంచి విముక్తులైన వర్తకులిద్దరూ సముద్రంలో కొంతదూరం ప్రయాణం చేశారు. సత్యదేవునికి వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. సన్యాసి రూపాన్ని ధరించి ఒకతీరంలో దర్శనమిచ్చాడు. కాలకృత్యాలకోసం పడవను ఆపుకున్న వారిని ఉద్దేశించి, “నాయనలారా! మీ పడవలో ఏముంది” అని అడిగాడు. ధనమదాంధులైన ఆ వైశ్యులు ఆ సన్యాసిని పరిహసిస్తూ మా పడవలో ఏముందో నీకెందుకు? మా ధనాన్ని అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు, అలములు తప్ప మరేమీ లేవు అని బదులు చెప్పారు. ఆ మాటలు విని సన్యాసి చిరునవ్వు నవ్వి, “అట్లే అగుగాక” అన్నాడు.
మళ్లీ ప్రయాణం కొనసాగించడానికి పడవ వద్దకు వచ్చిన సాధువర్తకుడు పడవలో కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. సంపదల స్థానంలో ఆకులు అలములను చూసి దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివివచ్చిన తరువాత ధనధాన్య సంపదలన్నీ మాయమయ్యాయని విలపించసాగాడు. అంతట అల్లుడు మామను జూచి ‘‘మామయ్యా! ఏడ్వటం వల్ల ప్రయోజనమేమిటి? మహనీయుడైన సన్యాసిని పరిహసించినందు వల్లనే మనకీ దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాం. కనుక ఆయననే వేడుకొందాం. ఆయననే శరణు కోరుదాం. మనల్ని తప్పక కరుణిస్తాడు. మన కోరికలు నెరవేరగలవు’’ అన్నాడు.
అల్లుని మాటలనాలకించిన సాధువు పరుగు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి, ‘‘స్వామీ! జ్ఞానశూన్యుడనై మిమ్మల్ని పరిహసించాను. నా తప్పును మన్నించండి. క్షమించి నాపై దయ చూపండి’’ అని పరిపరివిధాలుగా ప్రార్ధించాడు. భోరున విలపించాడు. అంతట ఆ సన్యాసి ‘‘ఓయీ! నా వ్రతం చేస్తానని చెప్పి మరిచిపోవడం భావ్యమా! దుష్టబుద్దితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలనే నేను శాపం ఇచ్చాను. నా శాపంవల్లనే నీకీ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకొన్నావా!’’ అన్నాడు.
అంతట సాధువు “స్వామీ! పుండరీకాక్షా! లోకమంతా నీ మాయవల్లనే మోహంలో పడి కొట్టుమిట్టాడుతోంది. బ్రహ్మాది దేవతలే నీ మాయను జయించ లేకపోతున్నారు. నిన్ను తెలుసుకో లేకుండా ఉన్నారు. మానవమాత్రుడను నేనెంతవాడను తండ్రీ! నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ జీవిని నేను. నీ అనుగ్రహానికి దూరమై తపిస్తున్న అభాగ్యుడను. నిన్ను తెలుసుకోవడం నా తరమా స్వామీ! నా అపరాధాన్ని మన్నించు. ఇకమీదట నిన్నెపుడూ మరువకుండా పూజిస్తాను. శరణన్న వారిని రక్షించు కరుణా సముద్రుడవు. నన్ను అనుగ్రహించు. నా సంపదను నాకిప్పించ’’మని పరిపరి విధాలుగా ప్రార్ధించాడు. సాధువర్తకుని ప్రార్ధనను మన్నించిన స్వామి, అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యాడు. ఆ తరువాత సాధువు తన పడవను పరిశీలించి చూడగా అదంతా ధనరాశులతో నిండి ఉంది.
ఆ సత్యదేవుని దయవల్లనే తన కోరిక తీరిందనుకుని పరివారంతో సహా స్వామిని పూజించి స్వగృహానికి ప్రయాణం సాగించాడు. కొద్దికాలానికి సొంత ఊరు చేరుకుని, ‘‘అల్లుడా! మనం మన రత్నపురానికి చేరాం’’ అంటూ తమ రాకను తెలపడం కోసం ఒక దూతను ఇంటికి పంపాడు. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, ‘‘అమ్మా! నమస్కారం మన అయ్యగారు, అల్లుడుగారు వచ్చారు. ఇప్పుడే పడవ వచ్చింది’’ అని వార్తను చెప్పాడు.
లీలావతి ఆ వార్త విని సంబరపడి, ‘‘అమ్మాయీ కళావతీ! సత్యనారాయణవ్రతం త్వరగా ముగించిరామ్మా! నేను పడవ వద్దకు పోతున్నాను’’ అని చెప్పి వెళ్లింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతం ముగించి ప్రసాదాన్ని భుజించటం మరచింది. పరుగు పరుగున పతిని చూడడానికి వెళ్లింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు ఆమెకు మరో పరీక్ష పెట్టాడు. ధనాన్ని సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశాడు. అది చూసి తీరాన ఉన్నవారు హాహాకారాలు చేశారు. లీలావతి, కళావతి దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవడం చూసిన లీలావతి నెత్తినోరూ బాదుకుంటూ విలపిస్తూ భర్తతో, “ఏమండీ! అల్లుడు అంత హఠాత్తుగా పడవతోసహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక మరేమిటి? అంటూ దుఃఖపడసాగింది.
కళావతి భర్త మునిగిపోయినందుకు ఏడవసాగింది. తన భర్త తనకళ్లెదుట మునిగిపోవడం చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని, వాటితో సహా సహగమనం చేయటానికి సిద్ధపడింది. సాధువర్తకుడు ఇదంతా చూసి, దుఃఖంలోనూ తెలివితెచ్చుకుని, “ఇదంతా స్వామి మాయ కాబోలు’’ అని ఊహించాడు.
శక్తికొద్దీ స్వామిని పూజిస్తానని సంకల్పించి అందరితోబాటు స్వామిని వేడుకున్నాడు. ఆ సమయంలో ఆకా శవాణి పలికింది. ‘‘ఓయీ! నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత ప్రసాదాన్ని ఆరగించడం మరచింది. ఆమె మళ్లీ ఇంటికి పోయి ప్రసాదాన్ని భుజించివస్తే అంతా శుభం జరగుతుంద’’ని వినిపించింది. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి పరుగుపరుగున ఇంటికివెళ్లింది. కళ్లకద్దుకుని ప్రసాదం తీసుకుంది. తప్పు మన్నించమని స్వామిని వేడుకొని తిరిగి నదివద్దకు వచ్చింది. ఆశ్చర్యంగా తన భర్త పడవతో సహా నీటిపై తేలడం చూసి సంతోషపడింది. అందరూ ఆనందించారు. సాధువర్తకుడు నది ఒడ్డునే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతం చేసికొని ఇంటికి పోయాడు. అటుపిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం ప్రతి పౌర్ణమినాడు, రవిసంక్రమణ సమయంలోనూ సత్యనారాయణస్వామి వ్రతం చేస్తూ సర్వసౌఖ్యాలు పొందాడు. చివరకు మోక్షం పొందాడు.

|| చతుర్ధాధ్యాయం సంపూర్ణం ||

5
పంచమాధ్యాయం ప్రారంభం

సూతమహర్షి చెబుతున్నాడు. ఓ మునిశ్రేష్టులరా! మీకు మరొక కథను చెబుతాను. శ్రద్దగా వినండి. పూర్వం తుంగధ్వజుడనే రాజు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడై ప్రజలను కన్నబిడ్డల వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. అతడు ఒకనాడు వేటకోసం అడవికి పోయి తిరిగివస్తూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకొంటున్నాడు. దూరంగా ఒక మారేడు చెట్టుక్రింద కొంతమంది యాదవులు వ్రతం చేసుకుంటుంటే చూశాడు. స్వామికి నమస్కారమైనా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తరువాత గోపాలురు ప్రసాదాన్ని రాజుగారి కిచ్చి స్వీకరించమన్నారు. రాజు అహంకారంతో ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయాడు.
ఆ రాజు కళ్లు తెరిపించేందుకు సత్యనారాయణ స్వామి లీలను ప్రదర్శించాడు. రాజుగారి వందమంది కుమారులు అకారణంగా చనిపోయారు. రాజ్యంలో అల్లకల్లోల పరిస్థితులేర్పడ్డాయి. శత్రువులు యుద్ధం ప్రకటించినట్లు వార్తలు వినవచ్చాయి. ఇదంతా చూచిన రాజుకు జ్ఞానోదయమైంది. “ఆహా! నిన్నటిరోజున యాదవులు ఇచ్చిన స్వామి ప్రసాదాన్ని నేను తిరస్కరించి నందువల్లనే ఈ సమస్యలు నన్ను చుట్టుముట్టాయి” అనుకొని వెంటనే గొల్ల వద్దకు పోయి వ్రతవిధానం తెలుసుకుని వచ్చాడు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో సత్యదేవుని వ్రతం ఆచరించాడు. అంతట స్వామి దయతలచి, మళ్లీ ధనధాన్యాది సంపదలను, 100 మంది పుత్రులను, రాజ్యసుఖములనిచ్చి అనుగ్రహించాడు. రాజు క్రమం తప్పక వ్రతం చేస్తూ అంత్యకాలంలో సత్యలోకాన్ని పొందాడు.
మహోన్నతమైన ఈ వ్రతరాజమును భక్తిశ్రద్ధలతో చేసేవారు, వ్రతం చూచినవారు, కథ విన్నవారు సత్యనారాయణస్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన కృపచే ధనధాన్య సంపత్తులను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందుతారు. ఇహలోకంలో సర్వసౌఖ్యములను అనుభవిస్తారు. మోక్షం పొందుతారు. ఈ వ్రతం భక్తితో చేస్తే దరిద్రులు ధనవంతులవుతారు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నవారు బంధవిముక్తి పొందుతారు. భయం తొలగిపోతుంది.
ఓ మునులారా! మానవులను సర్వదుఃఖాల నుంచి విముక్తి చేయగల శ్రీసత్యనారాయణ వ్రతవిధానాన్ని, దాని ఫలితాలను ఆచరించి ముక్తిపొందిన వారి కథలను మీకు బోధించాను. విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతాన్ని మించినది లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదం అని సూతమహర్షి శౌనకాదిమునులకు వ్రతవిధానాన్ని తెలియపరిచారు.

|| శ్రీసత్యనారాయణ స్వామి వ్రతకథ సంపూర్ణం ||

మంగళం మహత్
శ్రీశ్రీశ్రీ

వ్రతకథ విన్నవారంతా తమ చేతుల్లోని కథ అక్షతలను స్వామిపై వేసి నమస్కరించాలి. తదనంతరం సత్యనారాయణ స్వామి ప్రసాదంతో కూడిన మహానైవేద్యాన్ని సమర్పించాలి.
మహానైవేద్యం : చంద్రమా మనసోజాతః చక్షుస్సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయు రజాయత సౌవర్ణస్థాలిమధ్యే మణిగణ ఖచితే గోఘృతాక్తాన్ సుపక్వాన్ భక్ష్యాన్ భోజ్యాంశ్చ లేహ్యాన్ అపరిమితరసాన్ చోష్యమన్నం నిధాయ నానాశాకైరుపేతం దధిమధు సగుడక్షీరపానీయయుక్తం తాంబూలం చాపి విష్ణోః ప్రతిదివసమహం మానసే కల్పయామి రాజాన్నం సూపసంయుక్తం శాకచోష్య సమన్వితం ఘృతభక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ఓం భూర్భువస్సువః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించయామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా శ్రీ సత్యనారాయణ స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. అమృతాపిథానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి.
తాంబూలం : నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ ష్ణోద్యౌస్సమవర్తత పధ్భ్యాం భూమిర్దిశశ్రోత్రాన్ తథాలోకాగ్ం అకల్పయన్ పూగీఫలైః సకర్పూరైః నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ శ్రీ సత్యనారాయణస్వామినే నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం : నీరాజనం గృహాణ దేవం పంచవర్తి సమన్వితం తేజోరాశిమయం దత్తం గృహాణ త్వం సురేశ్వర శ్రీ సత్యనారాయణస్వామినే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం : ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురోర్నమః అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదావ ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నోవిష్ణుః ప్రచోదయాత్ శ్రీ సత్యనారాయణస్వామినే నమః సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణ నమస్కారం (మూడుసార్లు మీ చుట్టూ మీరు తిరిగి స్వామికి నమస్కరించాలి)
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదేపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసారసాగరాత్ మాం త్వం ఉద్ధరస్వ మహాప్రభో శ్రీ సత్యనారాయణస్వామినే నమః ప్రదక్షిణ నమస్కారమ్ సమర్పయామి
సర్వోపచారం : ఛత్రం సమర్పయామి చామరం వీచయామి. గీతం శ్రావయామి నృత్యం దర్శయామి నాట్యం సమర్పయామి సమస్త శక్త్యోపచారాన్ రాజోపచారాన్ సమర్పయామి.
ప్రార్ధన : అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం హృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణం చ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీవల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం పరం దుర్గమే విషమే ఘోరే శత్రుణాపరిపీడితే విస్తారయతు సర్వేషు తథానిష్ట భయేషు చ నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సిత మాప్నుయాత్ సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలాయా విత తం విశ్వం యేన తస్మై నమోనమః శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి.
ఫలం : ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతస్తవ తేన మే సఫలావాప్తిః భవేత్ జన్మజన్మని శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఫలం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఆనయా ధ్యానవాహనాది షోడశోపచారపూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ సత్యనారాయణ సుప్రీతో వరదో భవతు

శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి

|| శ్రీ సత్యనారాయణ స్వామి దేవతా అనుగ్రహ ప్రాప్తిరస్తు ||

శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసారా స్వామిని కొలిచీ హరతులీరమ్మా
నోచినవారికి నోచిన వరము
చూసిన వారికి చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసారా స్వామిని కొలిచీ హరతులీరమ్మా
స్వామిని పూజించే చేతులె చేతులట
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట
తన కథవింటే ఎవ్వరికైనా జన్మ తరించునట
ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం
అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా
మంగళమనరమ్మా జయమంగళమనరమ్మా
కరములు జోడించి శ్రీ చందనమలరించి
మంగళమగు శ్రీసుందరమూర్తికి వందనమనరమ్మ

Share this post with your friends