మన దేశంలో గల్లీకో ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కొన్ని ఆలయాలైతే.. ఇప్పటికి ఇవి ఎన్నో వింతలు, విశేషాలతో అలరారుతున్నాయి. అలాంటి వింతలూ.. విశేషాలకు నెలవైన ఆలయమే.. సౌమ్యనాథస్వామి దేవాలయం. ఈ గుడిని దేవతలే స్వయంగా కట్టించారని పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ ఆలయం ఎక్కడుంది? దాని విశేషాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా నందలూరులో ఈ సౌమ్యనాథ స్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ నారాయణుడు సౌమ్యనాథస్వామిగా అవతరించాడు.

చిరుమందహాసంతో, అభయహస్తంతో భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ఇక్కడ సౌమ్యనాథుడు పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరికొన్ని ఉపాలయాలు సైతం ఉన్నాయి. ఆంజనేయుడు, గరుత్మంతుడు, యోగ నారసింహుడు ఉపాలయాలనూ దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామికి ప్రతిరోజూ నిర్వహించే పూజలు ఒక ఎత్తైతే.. ఆషాఢమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలూ.. ముక్కోటి ఏకాదశి నాడు చేసే లక్ష తులసీ అర్చన మరొక ఎత్తు. ఇవి మాత్రమే కాకుండా శ్రావణ, ధనుర్మాసాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఈ క్షేత్రానికి తరలి వస్తారు.
