1. ఆత్మప్రదక్షిణ: సాదారణంగా ఇంట్లో ఏదైన వ్రతం లేక పూజ చేసిన తరువాత, మనచుట్టూ మనం సవ్య దిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను ఆత్మప్రదక్షిణ అని అంటాం. అంటే ప్రదక్షిణాపథం లేనప్పుడు ఒకేచోట నిలబడి చేసే ప్రదక్షిణ ఇది.
2. పాదప్రదక్షిణ: సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాపథంలో గానీ, ఆలయం చుట్టుగాని నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది.
3. దండ ప్రదక్షిణ: ప్రదక్షిణాపథంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి, అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయడం, మరలా సాష్టాంగనమస్కారం, మళ్ళీ ప్రదక్షిణ చేయడాన్ని దండప్రదక్షిణ అనంటారు. ఈ పద్ధతిలో నాలుగుదిక్కులలోగానీ, లేక నాలుగు దిక్కులు, నాలుగుమూలలు కలిపి ఎనిమిదిచోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు.

4. అంగప్రదక్షిణ: మనిషి అవయవాలన్నీ భూమిని తాకేటట్లుగా పడుకుని, ఆలయం చుట్టూ దొర్లుతూ చేసే ప్రదక్షిణకు అంగప్రదక్షిణ అని పేరు.
5. పైన పేర్కొన్న ప్రదక్షిణా పద్దతులన్నీ కలిపి చేసే ప్రదక్షిణే మిశ్రమ ప్రదక్షిణ.
సాధారణంగా ఆలయంలో రెండవ ప్రదక్షిణా పద్ధతినే అనుసరించాలి. మొక్కుబడులున్నవారు పైన పేర్కొన్నవాటిలో వేటినైన చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణాపథం ఉన్నప్పుడు, అందులోగాని ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలో గాని స్వామివారికి ఎదురుగా నిలబడి, అంటే ధ్వజస్తంభం వద్దగాని, ప్రదక్షిణామార్గం వద్దగాని నిలబడి స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి.
