మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర

మాఘ శుద్ధ పౌర్ణమికి రెండేళ్లకోసారి మేడారంలో మహాజాతర నిర్వహిస్తారు. తదుపరి సంవత్సరం చిన్నజాతర జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర పూర్తిగా గిరిజన సంప్రదాయంలో ఉంటుంది. ఈ జాతరలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల భక్తులు కూడా అసంఖ్యాకంగా పాల్గొంటారు. సమ్మక్క సారలమ్మలను ఒకే గద్దెపైకి తీసుకువచ్చి బంగారం అనేపేరుతో బెల్లంతో తులాభారాలు తూగి సమర్పిస్తారు. కరోనా నేపథ్యంలో ఈసారి భక్తులు అన్ని నియమాలూ పాటిస్తూ జాతరలో పాల్గొనాల్సి ఉంటుంది.

తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్టమైన గిరిజన జాతర మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మల జాతర. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతర ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో నిర్వహిస్తారు. ఎలాంటి విగ్రహాల ఆరాధన లేని ఈ మేడారం జాతర గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు దర్పణంగా నిలుస్తున్నది. వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతరను తొలినాళ్లలో కేవలం గిరిజనులు చిలుకలగుట్టపైన జరుపుకునేవారు. 1940 తరువాత గిరిజనేతరులు కూడా ఈ ఉత్సవాలలో భాగం అయ్యారు. అప్పటినుంచి ఈ జాతర చిలుకలగుట్టపై కాక కొండ కింద జరపడం ఆరంభమైంది. ఈ జాతరలో సమ్మక్క-సారలమ్మల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి, ఈ గద్దెలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకువస్తారు, సంపూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరలో తెలంగాణా నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తిస్ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలనుండి లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. ఎప్పుడు-ఎక్కడ మేడారం జాతర ప్రతి రెండేళ్ళకు ఒకసారి మాఘమాసపు పౌర్ణమినాడు నిర్వహిస్తారు. ఈ జాతర నాలుగు రోజుల పాటు సాగుతుంది. తెలంగాణా రాష్ట్రం లోని వరంగల్ జిల్లాతాడ్వాయి మండలం లోని అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఈ జాతర నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16న కన్నెపల్లినుంచి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను, ఫిబ్రవరి 17న సమ్మక్కను గద్దెవద్దకు తీసుకువస్తారు. 18న మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 19న మరల సమ్మక్క, సారలమ్మలను వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది.

మేడారం జాతరకు సంబంధించి అనేకమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో కాకతీయ రాజులకు, గిరిజనులకు మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించిన కథ ప్రముఖమైంది. కాకతీయలతో జరిగిన యుద్ధంలో సారలమ్మ, జంపన్న, నాగులమ్మ గోవిందరాజు వంటి వీరులు వీరమరణం పొందారు. భక్తావళిలో తరతరాలుగా ఈ కథ ప్రచారంలో ఉంది. జానపదులలో ఈ కథ అజరామరంగా నిలిచి ఉంది. ఈ కథానుసారం 12 శతాబ్దంలో జగిత్యాల ప్రాంతంలోని పొలవాసకు చెందిన గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. అప్పట్లో కాకతీయ వంశానికి చెందిన మొదటి ప్రతాపరుద్రుడు రాజ్యవిస్తరణ కాంక్షతో పొలవాసపై దాడి చేశాడు. కాకతీయల ధాటికి తట్టుకోలేక గిరిజన నాయకులు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం చేశారు. అప్పటికే కాకతీయుల సామంతునిగా ఉన్న పగిడిద్దరాజు కరువు కాటకాల కారణంగా రాజుకు కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తాడు. పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు, కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పోయారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమ్మక్క కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతూ, వీరోచితంగా పోరాటం సాగించింది. యుద్ధంలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపుధారలతోనే యుద్ధభూమి నుంచి చిలుకగుట్ట వైపు నిష్క్రమిస్తూ, మార్గమధ్యంలో అదృశ్యమైంది. ఆమెను వెదుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమె కనిపించలేదు, కాని ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించింది. దాన్నే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

మాఘ పౌర్ణమి రోజు సాయంత్రం సారక్కను అడవినుంచి కన్నెబోయిన పల్లెకు చేర్చి చెట్టుక్రింది గద్దెపై చేర్చటంతో ఈ జాతర ప్రారంభం అవుతుంది. తరువాతి సూర్యాస్తమయాన సమ్మక్కను చిలుకల గట్టు నుంచి తీసుకువచ్చి సారక్క గద్దె పక్కనే మరో గద్దెపై చేర్చుతారు. వెదురుగడలను పసుపు, కుంకుమలతో అలంకరించి, గద్దె పక్కనున్న పెద్దవృక్షంతో కలిపి కట్టి వారి ప్రతిరూపాలుగా భక్తులు భావిస్తారు. గద్దె చుట్టూ మేళతాళాలతో కోలాహలంగా ఆరాధన చేస్తారు. కొబ్బరికాయలు, బెల్లం, పసుపు కుంకుమలను అమ్మవార్లకు సమర్పిస్తారు. జాతరకు సుమారు పది రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు ఆరంభమౌతాయి. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మవారిని పూజించి సమ్మక్క దేవత పూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. జాతర మొదటి రోజున కన్నెపల్లినుంచి సారలమ్మను తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడోరోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగో రోజు సాయంత్రం దేవతలనిద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు.

అమ్మవార్ల దయవల్ల తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం చెల్లిస్తామని భక్తులు ఇక్కడ మొక్కుకుంటారు. అలా కోరికలు నెరవేరిన వారు అమ్మవార్లకు మొక్కుల రూపేణ బెల్లాన్ని సమర్పిస్తారు. ఈ బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. సర్వసాధారణంగా భక్తులు స్వంత ఊరిలోనే నిలువెత్తు బంగారం (బెల్లం) తులాభారం వేయించి, దాన్ని మేడారంలో అమ్మవార్లకు నివేదిస్తారు. ఆ బంగారంలో కొంత మొత్తాన్ని అమ్మవార్లకు సమర్పించి, మిగతాదాన్ని ప్రసాదంగా బంధువులకు, మిత్రులకు పంచుతారు. మరికొందరు మొత్తం బెల్లాన్ని అమ్మవార్లకే మొక్కుగా చెల్లిస్తారు. నేరుగా జాతర వద్ద బెల్లం కొనుగోలు చేసే భక్తులకోసం ప్రత్యేకంగా ప్రభుత్వ బెల్లం విక్రయకేంద్రాలు ఉంటాయి. పూజలూ మొక్కుబడులు వంశ పారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం(బెల్లం) నైవేద్యంగా సమర్పించుకుంటారు. మొక్కుబడులలో బంగారం(బెల్లం) తో పాటు వడిబాలు, బియ్యం, తొట్లెలు, కొబ్బరికాయలు, పసుపుకుంకుమలు, వస్త్రాలు, బోనాలు మొదలైనవాటిని కూడా సమర్పించుకుంటారు. భక్తుల మొక్కుబడుల అనంతరం దేవతలు తిరిగి వనప్రవేశం చేస్తారు.

ఈ పండుగను సూలాల పండుగ, కోలు కడిగే పండుగ అని కూడా వ్యవహరిస్తారు. గిరిజనులు వర్షాధారిత పంటలు పండిస్తారు కాబట్టి వర్షాలు పడుతాయా లేదా అని చాలా ఆసక్తి చూపుతారు. ఇందుకోసం చేసే పండుగను సుంకు పండుగ అంటారు. ఉగాది పండుగరోజు జరిగే సామూహిక పంచాంగ్ర శ్రవణాన్ని పోలిన విధానం దీనిలో కనిపిస్తుంది. ఈ పండుగకు కొద్దిరోజుల ముందునుంచి ఇప్పపువ్వులు రాలడం మొదలవుతుంది. ఈ ఇప్పపువ్వులను కిందపడకుండా రెండు కొమ్మలకు మధ్య ఒక కొత్త గుడ్డను కడతారు. ఈ రకంగా కట్టడాన్ని కోలు కట్టడం అంటారు. ఈ గుడ్డలో పడిన ఇప్పపువ్వులను సేకరించి కొన్ని పువ్వులను దాచి, మిగిలిన పువ్వులను పులియబెట్టి ఇప్పసారా చేస్తారు. ఈ పండుగరోజున అందరు తమ వేల్పులను ఉండే చోటుకు వస్తారు. ఒక చెంబులో కొత్తగా కాచిన ఇప్పసారాని తీసుకుని గ్రామపెద్ద లేదా వడ్డె కూర్చుంటారు. అతడు మిగిలిన సభ్యులకు ఈ సారాయిని పంచమని ఆదేశిస్తాడు. మద్య, మాంసాలను ఉల్లాసంకోసమే కాకుండా సంప్రదాయంలో నైవేద్యంలా భావిస్తారు కాబట్టే కావచ్చు ఈ ఉత్సవంలో ఎక్కువగా వీటి వినియోగం కూడా వుంటుంది. అంతటా కోలాహలం. సమ్మక్క గద్దెపైన లభించే కుంకుమ పొందితే మోక్షం వస్తుందని, ఇక్కడ గద్దెమీద బెల్లం స్వీకరిస్తే చాలాకాలంగా ఉన్న వ్యాధులు కూడా తగ్గుతాయనీ భక్తులు నమ్ముతారు. పూజ తర్వాత పసుపు కుంకుమలు ప్రసాదంలాగా తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని విశ్వసిస్తారు. సమ్మక్క చిలుకలగట్టునుండి బయలుదేరి గద్దెలమీదకు వస్తున్నపుడు ఎదురుగా వెళ్ళి మొక్కితే సంతానం కలుగుతుందని భావిస్తారు. మరికొందరు సమ్మక్కను తీసుకుని వడ్డెలు వస్తున్న దారికి అడ్డంగా పడుకుంటారు. వారిపైనుండి పూజారులు నడుచుకుంటూ వెళితే జన్మసార్ధకమయినట్లుగా భక్తులు భావిస్తారు. జంపన్న వాగులో స్నానాలు, తలనీలాల సమర్పణం, ఎదురుకోళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించడం, లక్ష్మి దేవర వేషాలు, శివసత్తుల పూనకాలు, వడిబియ్యం సమర్పణం, బంగారంగా పిలిచే బెల్లంతో తులాభారం, కోయదొరల భవిష్యవాణి, మహిళా వేషధారణతో ఉండే పురుషుల ఆటపాటల లాంటి దృశ్యాలు జాతరను కోలాహలంగా మారుస్తాయి.

మేడారం వరంగల్లునుంచి 94 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్లు హైదరాబాదునుంచి 145 కి.మి, విజయవాడ నుంచి 237 కి.మి, విశాఖ నుంచి 520 కి.మి. తిరుపతి నుంచి 652 కి.మి. దూరంలో ఉంది. వరంగల్లునుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంటాయి. వసతి సౌకర్యాలు : మేడారం ఆదివాసీ ప్రాంతం కావడం వల్లస్థిరకట్టడాల నిర్మాణానికి అనుమతి లేదు. భక్తులు చెట్లక్రింద లేదా తాత్కాలికంగా వేసిన గుడారాల్లో తమ వసతిని ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. భోజనం లభిస్తుంది.

Share this post with your friends