ఒంటిమిట్ట కోదండ రామాలయం దక్షిణాదిలో భద్రాచలం తరువాత చాలా ప్రాముఖ్యమున్న దేవాలయం. ఈ ఆలయాన్ని ఒక చెరువు పేరు మీదుగానే పిలుస్తారు. అసలా చెరువు ఏంటి? దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది. ఆ ఆలయం చెరువు పేరు మీదుగా ఎందుకు ఫేమస్ అయ్యిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న ఆలయమే ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఒంటిమిట్ట అనేది చెరువు పేరు. కడప జిల్లాలోని అతి పెద్ద చెరువు ఇదే. కొండలకు ఆనుకుని ఎంతో అద్భుతంగా ఉంటుందీ చెరువు. ఈ చెరువుకి చాలా గొప్ప చరిత్ర ఉంది. నిజానికి 1340 వ సంవత్సరంలో ఈ ఒంటిమిట్ట ప్రాంతం చుట్టూ దట్టమైన అరణ్యం ఉండేది.
రామాలయ నిర్మాణంలో అప్పట్లో కీలక పాత్ర పోషించిన వారే ఒంటడు–మిట్టడు. అయితే ఒకసారి ఈ ప్రాంతానికి అప్పటి ఉదయగిరి పరిపాలకులైన చక్రవర్తి కంపరాయులు వచ్చారట. ఆయనకు రామ తీర్థంలోని నీటిని అందించి దాహం తీర్చి సకల మర్యాదలు చేశారట. ప్రతిగా రాములవారి ఆలయాన్ని చూపించి అభివృద్ధి చేయాలని కంపరాయలును కోరారట. దీంతో కంపరాయలు గుడి నిర్మాణంతో పాటు ఆ ప్రాంత ప్రజల కోసం చెరువు నిర్మాణం చేయ తలపెట్టి.. దాని బాధ్యతలను ఒంటడు, మిట్టడులకు అప్పగించారు. ఆ తరువాత వీరిద్దరూ వాటి నిర్మాణాన్ని తమ భుజస్కందాలపై వేసుకుని చేశారట. అలా ఆ చెరువుకు ఒంటిమిట్ట చెరువుని.. ఆ రామాలయానికి ఒంటిమిట్ట కోదండ రామాలయం అని పేరు వచ్చింది.