శ్రీరామనవమి రోజు అయోధ్యలో అపూర్వఘట్టం సాక్షాత్కారమివ్వబోతోంది. నిజానికి ఇది ఇప్పటి వరకూ మనం చూడని అపురూపమైన ఘట్టం. బాలరాముడి నుదుటిని నవమినాడు సూర్యకిరణాలు ముద్దాడబోతున్నాయి. రామయ్య కల్యాణ తిలకాన్ని సూర్యుడే దిద్దబోతున్నాడు. ఇవాళ (ఏప్రిల్ 13) మధ్యాహ్నం దీనికి సంబంధించిన రిహార్సల్స్‌ను ఆలయ కమిటీ పూర్తి చేసింది. రిహార్సల్స్ సమయంలో బాలరాముడి నుదుటిని సూర్యకిరణాలు తాకాయి. అయోధ్య బాలరాముడికి నిత్యం తిలకం దిద్దుతూనే ఉంటారు. కానీ సూర్యుడే వచ్చి తిలకం దిద్దడం మాత్రం ఒక అద్భుత ఘట్టమే.
అయితే సాధారణ రోజుల్లో బాల రామయ్యకు సూర్యాభిషేకం వంటివి కానీ సూర్య కిరణాలు.. రామయ్య నుదుటిని తాకడం వంటివేమీ ఉండవు. దీనిని శ్రీరామనవమి నాడు ప్రత్యేకంగా నిర్వహించాలని ఆలయ అధికారులు భావించారు. దీనిలో భాగంగానే నేడు రిహార్సల్స్ కూడా నిర్వహించారు. ఇవాళ నిర్వహించిన కార్యక్రమం తమలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇక అపూర్వ ఘట్టానికి 17న ముహూర్త సమయం కూడా ఫిక్స్ చేశారు. శ్రీరామనవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు బాల రామయ్య నుదుటిన సూర్యుడు తిలకం దిద్దబోతున్నాడు. పండుగ నాడు పండుగ లాంటి వార్త అంటే ఇదే కదా..