భీష్ముడు మోక్షం పొందిన పర్వదినం.. భీష్మ ఏకాదశి విశిష్టత

భీష్మ ఏకాదశి విశిష్ట పర్వం. రాజ్యాధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న భీష్ముడు ఇచ్ఛా మరణాన్ని వరంగా పొందాడు. వాత్సల్యం, భగవత్ భక్తి మూర్తీభవించిన కరుణామృత సింధువు భీష్ముడు. జగతికి విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని అందించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలించాడు. అష్టవసువుల్లో ఒకనిగా భీష్ముడు సదాపూజనీయుడు.

మహాభారత వీరుల్లో మణిపూస భీష్ముడు. ఎదురైన ప్రతి కష్టాన్ని ఓ మెట్టుగా మలచుకున్న ధీరోదాత్తుడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలిస్తూ తన మరణతిథిని పర్వదినంగా అనుగ్రహించమని శ్రీకృష్ణుని కోరాడు. ఆనాటినుండి మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలుస్తున్నారని నారదపురాణం చెబుతోంది. దీనికి జయఏకాదశి అని మరో పేరు కూడా ఉంది.

వసువులు దేవగణాలకు చెందినవారు. వారంతా ఓసారి భార్యలతో కలసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లినప్పుడు మహర్షితాలూకు హోమధేనువుని చూసి ముచ్చటపడ్డారు. ప్రభాసుడు (ద్యౌ అనే పేరు కూడా ఉంది) అనే వసువు భార్య కోరగా వాళ్లు ఆ ఆవును తమ వెంట తీసుకుపోయారు. వసువులు చేసిన పనికి కోపగించుకున్న వశిష్ఠుడు వాళ్లను భూలోకంలో మానవులుగా పుట్టమని శపించాడు. శాపానికి భయపడ్డ వసువులు మహర్షిని శాపావకాశాన్ని కోరగా ప్రభాసుడు మినహా మిగిలినవారు ఎక్కువకాలం భూలోకంలో ఉండనక్కరలేదన్నాడు. చంద్ర వంశానికి చెందిన శంతను మహారాజుకి – గంగాదేవికి ఎనిమిదో సంతానంగా ఆ వసువు పుట్టాడు. అతనికి దేవవ్రతుడు అని పేరుపెట్టారు. వశిష్ఠుడు… శుక్రాచార్యుడు… పరశురాముడు ఆయనకు గురువులయ్యారు. తండ్రి సుఖం కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని… రాజ్య పరిపాలనాధికారం తనకు అక్కర్లేదని భీషణ ప్రతిజ్ఞ చేసి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. పితృభక్తి పరాయణుడని ఆయనను లోకం కీర్తించింది. తండ్రి ఆయనకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదించాడు. మహారథుడిగా కీర్తిమంతుడయ్యాడు. ఒకే సమయంలో పదకొండు వేలమంది విలుకాళ్లు ఎదురొచ్చినా యుద్ధం చెయ్యగల వీరుణ్ణి మహారథుడిగా పరిగణిస్తారు. సత్యనిష్ఠ… ధర్మదృష్టి భీష్ముని సత్యనిష్ఠ అమోఘమైంది. ఎన్ని కష్టాలెదురైనా ఆయన సత్యనిష్ఠకు దూరంకాలేదు. సత్యంకంటే ఏదీ గొప్పది కాదని భీష్ముడు భావించాడు. అదే విషయాన్ని ధర్మరాజుకి బోధించాడు. ‘సత్యాన్నాస్తి పరోధర్మః’….. సత్యం కంటే గొప్ప ధర్మం లేదు. సనాతన ధర్మానికి మూలకారణం సత్యమే. సత్యానికి, ధర్మానికి అవినాభావ సంబంధముంది. అందువల్ల సత్యం లేకుండా ధర్మంలేదు. ధర్మం లేకపోతే సత్యానికి ఉనికే లేదు, మనుగడే లేదు. మార్పు చెందనిది, నాశనంలేనిది, నిత్యమైనది సత్యమొక్కటేనని భీష్ముడు భావించాడు.

ఏది ధర్మం. ఏది అధర్మమని నిర్ణయించడంలో ఆయన్ను మించినవారు లేరు. స్వయంగా శ్రీకృష్ణుడే ఆయన్ను మూర్తీభవించిన ధర్మంగా పేర్కొన్నాడు. అయినా రెండు సందర్భాల్లో మాత్రం భీష్ముడు అధర్మానికి తలవంచి మిన్నకుండిపోయాడు. మొదటి సందర్భం ద్రౌపదిని నిండు సభలోకి లాక్కొచ్చి వస్త్రాపహరణం చేస్తూ ఉంటే చూస్తూ నిరోధించలేదు. ఇక రెండో సందర్భం యుద్ధాన్ని ఆపేందుకు చివరి ప్రయత్నంగా శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఆయన్ను దుర్యోధనాదులు బంధించి చంపడానికి ప్రయత్నిస్తే ఆపలేదు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఆయన తప్పు ఉందని చెప్పలేం. అందులో ఎన్నో ధర్మసూక్ష్మాలు ఇమిడివున్నాయని తత్త్వజ్ఞులు చెబుతారు. అయినా కొంతైనా తన తప్పిదం ఉందని భావించిన నిర్మల హృదయుడు భీష్ముడు. అందుకు తనను తాను శిక్షించుకున్నాడు. సృష్టిలో ఇటువంటి శిక్షను విధించుకున్న మొదటి… చివరి వ్యక్తి భీష్మాచార్యుడు. విష్ణుభక్తుడు ధర్మాలన్నీ తెలిసిన మహానుభావుడు భీష్మాచార్యుడు. ఆ జ్ఞాన సంపద ఆయనతోనే అంతరించిపోకూడదని శ్రీకృష్ణుడు భావించాడు. ముందు తరాలకు ఆ జ్ఞాన సంపదను అందించాలని అనుకున్నాడు. యుద్ధంలో ఆత్మీయులందరినీ కోల్పోయి విషాదంలో మునిగిపోయిన ధర్మరాజును వెంటబెట్టుకుని అంపశయ్యపై ఉన్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు. వర్ణాశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు, శ్రాద్ధధర్మాలు, దానధర్మాలు, స్త్రీ ధర్మాలు… ఇలా సమస్త ధర్మాలను గురించి ధర్మరాజుకు బోధింపచేశాడు. భీష్ముని ధర్మబోధ అంతా మహాభారతంలోని శాంతి, అనుశాసనిక పర్వాల్లో ఉంది.

ధర్మరాజును వెంటబెట్టుకుని వచ్చిన శ్రీకృష్ణుని చూడగానే భీష్ముడు పరమ భక్తితో ఆయనను స్తుతించాడు. అదే ‘భీష్మ స్తవం’. శ్రీవైష్ణవులకు పరమ పవిత్రమైన ఐదుస్తవాల్లో భీష్మ స్తవాన్ని ప్రముఖంగా పరిగణిస్తారు. ఈ స్తవాన్ని భీష్ముడు ‘శ్రీకృష్ణాయ నమః’ అని ముగించాడు. దీన్ని శ్రీకృష్ణమహామంత్రంగా సంప్రదాయవేత్తలు సంభావిస్తారు. లోకానికి భీష్ముడు అందించిన మహత్తరమైన కానుక ఈ స్తవరాజం. మరో కానుక శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.

మాఘ శుద్ధ చతుర్ధినుంచి మాఘ శుద్ధ అష్టమి వరకూ ఐదు రోజుల్ని భీష్మ పంచకం అంటారు. సైన్యాధిపతిగా పది రోజులు యుద్ధం చేశాడు. అంపశయ్య మీద 58 రోజులపాటు గడిపాడు. ఉత్తరాయణ పుణ్యకాలం రాగానే రోజుకో ప్రాణం చొప్పున పంచప్రాణాలు విడిచిపెట్టాడు భీష్ముడు అనే కథ వంగ ప్రాంతంలో బాగా ప్రచారంలో ఉంది. భీష్మాష్టమి గురించి పద్మపురాణంలోని హేమాద్రి వ్రత ఖండంలో ప్రస్తావించారు. రోజులో పగటి సమయం, మాసంలో శుక్లపక్షం, సంవత్సరంలో ఉత్తరాయణం… ఈ మూడూ కాంతిమార్గాలని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు. అటువంటి అమృత ఘడియలు వచ్చేవరకు మరణంకోసం అంపశయ్యపై ఎదురుచూసిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమినాడు ప్రాణాలు వదిలాడు. అందుకే మాఘశుద్ధ అష్టమి మొదలు మాఘశుద్ధ ద్వాదశి వరకు గల అయిదు రోజులను భీష్మ పంచకమంటారు. భీష్మాష్టమినాడు, ఏకాదశినాడు భీష్మునికి తిలతర్పణాలు వదులుతారు. అలా చేస్తే సంతానం కలుగుతుందని, చేసిన పాపాలు నశిస్తాయని ఓ నమ్మకం. మాఘశుద్ధ ఏకాదశినాడు విష్ణువును తులసిదళాలతో పూజిస్తారు. భీష్మ స్తవాన్ని చదువుతారు. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తారు.

Share this post with your friends