‘శివ’ అంటే ఎవరనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. ఠక్కున శివుడనో, శంకరుడనో.. పరమేశ్వరుడనో చెప్పేస్తారు. మరి ‘శివా’ అంటే ఎవరంటే చెప్పగలరా? ఒకవేళ చెప్పినా కూడా శివుడనే అంటారు చాలా మంది. ‘శివా’ అంటే శివుడు కాదు.. పార్వతి దేవి. పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడన్న విషయం తెలిసిందే. తనలోని సగభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేశాడు. అందుకే ‘శివం మూలమిదం జగత్’ అని అన్నారు. సృష్టిని ప్రారంభించడానికి ముందు ఒకరోజు బ్రహ్మదేవుడు శివుని గురించి తపస్సు చేశాడట. అప్పుడు బ్రహ్మ ముందు శివుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ శివరూపాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యచకితుడు అయ్యాడు.
ఈశ్వరునిలో సగభాగం పురుష రూపంతో, సగభాగం స్త్రీ రూపంతో దర్శనమిస్తూ ఉంటారు. అంటే ఒకే రూపంలో రెండు వేర్వేరు తత్త్వాలు గోచరించాయి. అదే అర్థనారీశ్వర తత్త్వం. శివుడిని అలా చూసిన బ్రహ్మదేవునికి విషయం బోధపడింది. అప్పుడు తాను సృష్టిని చేయబోతున్నానని.. కాబట్టి స్త్రీ పురుషునిగా విడిపొమ్మంటూ శివయ్యను అర్థించాడు. బ్రహ్మ ప్రార్థనను మన్నించిన శివుడు తనలోని పురుషతత్త్వాన్ని నరునిగా, స్త్రీతత్త్వాన్ని ప్రకృతిగా అనుగ్రహించాడు. అలా ఆదిదంపతులు శివపార్వతులుగా మారారు. శివపార్వతులేఈ సృష్టికి కారకులు. ఆ స్వామి అంబికతో కలిసి సాంబుడై, సాంబశివునిగా పూజలు అందుకుంటున్నాడు.