శ్రీ గోవిందరాజ స్వామివారిని కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి అన్నగా పేర్కొంటారు. పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివసించే సమయంలో వివాహ మహోత్సవం నిమిత్తం కుబేరుని వద్ద నుండి ధనం అప్పుగా తీసుకున్నారని విశ్వసిస్తారు. ఆ ధనాన్ని కొలిచే బాధ్యతను శ్రీనివాసుడి అన్నయ్య అయిన శ్రీ గోవిందరాజ స్వామివారికి అప్పగించారని స్థల పురాణం తెలియజేస్తోంది. ధనాన్ని కొలుస్తూ అలసిన స్వామివారు ఆదిశేషునిపై శయనించిన దివ్య రూపమే నేటి శ్రీ గోవిందరాజ స్వామివారి దర్శనమని భక్తుల విశ్వాసం.

గర్భాలయంలో దివ్య దర్శనం
ఆదిశేషునిపై శయనిస్తున్న స్వామివారు గర్భాలయంలో దివ్య కాంతులతో దర్శనమిస్తూ భక్తుల హృదయాలకు ప్రశాంతతను ప్రసాదిస్తున్నారు. స్వామివారి నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, మోక్షం కోసం తపస్సు చేస్తున్న మధు–కైటభ రాక్షసులు కొలువై ఉన్న దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.
దర్శనం – నిత్య సేవలు
ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామివారి సేవలు ప్రారంభమవుతాయి. ఉదయం 5.30 గంటలకు విశ్వరూప దర్శనం, 6.30 గంటలకు తోమాల సేవ, 7.30 గంటలకు అర్చన, 8 గంటలకు అర్చనానంతర దర్శనం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవతో నిత్య కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ సేవల్లో పాల్గొనే భక్తులు అపార ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.
భక్తులకు ఉచిత అన్నప్రసాదాలు
శ్రీ గోవిందరాజ స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు చక్కెర పొంగలి, అన్నం, సాంబారు, రసం, కర్రీ, చట్నీ, మజ్జిగతో రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. అదేవిధంగా, ఆలయం సమీపంలోని పాత మ్యూజియంలో ప్రతిరోజూ ఉచిత అన్నప్రసాదాలను అందిస్తున్నారు. 2026 ఫిబ్రవరి నెల నుండి సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాంబారు అన్నం, పెరుగు అన్నం కూడా పంపిణీ చేస్తున్నారు.
