జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు వెలిసిన దివ్యక్షేత్రంగా గురువాయూర్‌ను పేర్కొంటారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్వాపర యుగాంతంలో తన విగ్రహాన్ని తయారు చేసుకున్నాడని చెబుతారు. తన విగ్రహాన్ని తనే తయారు చేసుకుని శిష్యుడైన ఉద్ధవునికి శ్రీకృష్ణుడు ఇచ్చాడని ఆలయ స్థలపురాణం చెబుతోంది. ద్వాపర యుగాంతంలో మహాప్రళయం వచ్చింది. దీంతో ప్రపంచమంతా నీట మునిగింది. ఈ సమయంలో గురువు వాయుదేవునితో కలిసి సముద్ర జలాలపై తేలియాడుతున్న శ్రీకృష్ణుని విగ్రహాన్ని గురువాయూర్‌లో ప్రతిష్టించినట్లుగా స్థల పురాణం చెబుతోంది. మహిమాన్వితమైన ఈ శ్రీకృష్ణుని విగ్రహం రాతితోను, లోహంతోనో తయారు కాలేదు. ‘పడ అంజనం’ అనే మిశ్రమంతో తయారైనట్లు తెలుస్తోంది.

జనమేజయుడు స్వస్థత పొందిన ప్రదేశంగా గురువాయూర్‌ను చెబుతారు. మహాభారతం ప్రకారం ఒకానొక సమయంలో అర్జునుని మనమడు, అభిమన్యుని కుమారుడు అయిన పరీక్షిత్ మహారాజును నాగులరాజు అయిన తక్షకుడు కాటు వేశాడట. ఆగ్రహించిన పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు భయంకరమైన సర్పయాగాన్ని నిర్వహించాడట. దీంతో అసలు ఈ ఘటనతో ఏమాత్రం సంబంధం లేని అమాయకమైన లక్షలాది నాగులు కూడా సర్పయాగంలో ఆహుతయ్యాయట. ఈ పాపానికి గాను జనమేజయుడు కుష్టు వ్యాధి బారినపడ్డాడట. వ్యాధి నివారణ కోసం దత్తాత్రేయుడిని జనమేజయుడు ఆశ్రయించగా.. నిత్యం గురువాయూర్‌లో శ్రీకృష్ణుని దర్శనం చేసుకోమని చెప్పాడట. అలా నిత్యం కన్నయ్య దర్శనంతో జనమేజయుడికి క్రమేణా కుష్టురోగం నయమైంది.
