ఇక మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో కాల బైరవుడి గురించి తెలుసుకున్నాం. ఇక్కడి ఆలయంలో స్వామివారు కేవడ స్వామి రూపంలో పూజలందుకుంటారు. ఇక్కడి ఆలయ విశేషాలు చాలా ఉన్నాయి. ఇక్కడి కాలభైరవుడిని గొలసులతో కట్టేసి ఉంచుతారని దానికి కారణమేంటో కూడా తెలుసుకున్నాం. ఇక ఈ స్వామివారిని పూజించిన భక్తుల ఇంట ప్రతికూల శక్తులకు ఆస్కారమే ఉండదట. కాలభైరవుడంటే శివుని రూపమే. కాల భైరవ అష్టమి రోజున భైరవుడు ఆవిర్భవించాడనేది హిందువుల నమ్మకం. బతుక్ భైరవ రూపంలో ఇక్కడ భైరవుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామివారి విగ్రహం ఎలా ఉంటుందంటే.. రుద్రుని రూపంలో సింధూరం ధరించి బంగారు, వెండి కిరీటం ధరించి ఉంటుంది.
ఈ భైరవ దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఈ ఆలయం 1424 సంవత్సరంలో నిర్మితమైంది. దీనిని నిర్మించడానికి ముందు ఝలా రాజ పుత్రులకుటుంబానికి చెందిన కొంతమంది భైరవుడి విగ్రహాన్ని గుజరాత్ తీసుకువెళుతున్నారట. ఆ సమయంలో రత్నసాగర్ చెరువు వద్దకు రాగానే వాహనం కదలకుండా అక్కడే నిలిచిపోయింది. దీంతో ఆ ప్రదేశంలోనే భైరవుడిని ప్రతిష్టించారు. ఝాలా రాజవంశానికి చెందిన రాజు రాఘవ్ దేవ్ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని నమ్మకం. అప్పటి నుంచి బాబా భైరవుడు ఝలా రాజ్‌పుత్ సమాజానికి కుటుంబ దేవతగా పూజలను అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో స్వామివారికి దాల్ బాటితో పాటు భక్తులు మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.