వినాయక చవితికి పెద్దగా సమయం లేదు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితిని దేశమంతా జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వినాయక మండపాలకు పలు చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముంబై. ఆ తరువాత హైదరాబాద్ గుర్తొస్తుంది. హైదరాబాద్‌లోనూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. బొజ్జ గణపయ్యకు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు జంట నగరాలు సైతం సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ నగర ఇమేజ్ పెంచేలా వినాయక చవితి, నిమజ్జనం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ కమాండర్ కంట్రోల్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలపై ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తో పాటు జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. వచ్చే నెల ఏడో తారీఖు నుంచి హైదరాబాద్ లో వినాయక ఉత్సవాలు జరుగనున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాల కేబుల్‌ల రిపేర్ వంటి పలు మౌలిక వసతులకు సంబంధించి అధికారులు చర్చించారు. అలాగే వినాయక నిమర్జనం జరిగే ప్రాంతాలు, చెరువుల వద్ద ఏర్పాట్లపై చర్చ జరిగింది.