తిరుమలలో నిత్యం మనకు వినిపించే అనౌన్స్‌మెంట్ దొంగలున్నారు జాగ్రత్త. అది ఆలయం వెలుపల భక్తులకు వినిపిస్తూ ఉంటుంది. కానీ ఒక దొంగ ఏకంగా ఆలయంలోనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి నగదును ఓ యువకుడు దొంగిలించాడు. ఇదంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది పరిశీలించి.. సదరు యువకుడిని గుర్తించారు.
హుండీలో నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం రూ.15 వేల నగదు చోరీ చేసి పారిపోయాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా సిబ్బంది అదే రోజు సాయంత్రం 6.00 గంటలకు దొంగతనం చేసిన యువకుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి విచారించగా.. అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ. 15 వేల నగదును భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్పగించారు.