
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. భక్తులు, ఈ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే వీఐపీలను దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేశారు. వసతి సౌకర్యం నుంచి గ్యాలరీలలో కూర్చొనే భక్తుల వరకూ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నారు. అయితే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు అత్యంత వైభవంగా గొడుగుల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
గరుడసేవలో అలంకరించేందుకు గానూ.. చెన్నై నుంచి తిరుమలకు గొడుగుల ఊరేగింపు చేరుకుంటుంది. ఈ గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు సెప్టెంబర్ 27న తిరుమలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఈ కీలక సూచన చేసింది.
