సప్త చిరంజీవుల్లో ఒకరిగా మార్కండేయుడిని పేర్కొంటారు. మార్కండేయుడు జన్మతః అల్పాయుష్కుడు. పట్టుదలతో శివుడి గురించి తపస్సు చేసి చిరంజీవిగా వరం పొందాడు. అలాంటి మార్కండేయుడు ఓ తీర్థంలో స్నానమాచరించి చిరంజీవిగా మారాడని తెలుసుకుందాం. ఆ తీర్థం ఇప్పటికీ ఉంది. దానిని మృత్యు వినాశినిగా పేర్కొంటారు. మృత్యువును జయించిన చిరంజీవిగా మార్కండేయ మహర్షి ప్రసిద్ధిగాంచాడు. మృకండు మహర్షి, మరుద్వతిల కుమారుడే మార్కండేయుడిగా పేర్కొంటారు. ఈ మార్కండేయుడు మహా శివభక్తుడు కావడంతో నిత్యం పరమశివుడిని నామ స్మరణలో మునిగి తేలేవాడు.

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ‘తిరుప్పేర్ నగర్’ క్షేత్రం ఉంది. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా దీనిని పేర్కొంటారు. ఈ క్షేత్రాన్ని ‘బృహత్పురి’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ శ్రీమహావిష్ణువు ‘అప్పకుడత్తాన్’ పేరుతోను, అమ్మవారు కమలవల్లీ తాయారు పేరుతో భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో మార్కండేయుడు స్నానమాచరించి మృత్యువు నుంచి బయటపడిన తీర్థం ఉంది. దీనిని మృత్యు వినాశిని తీర్థంగా పిలుస్తారు.
