తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతే టీటీడీ ప్రథమ లక్ష్యం

తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించడం టీటీడీ ప్రథమ లక్ష్యమని, తిరుమలలోని హోటళ్ల యజమానులు భక్తులకు ఆహారాన్ని అందించడంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో సోమవారం సాయంత్రం హోటళ్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, తిరుమలలోని అన్ని హోటళ్లు, తినుబండార కేంద్రాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు భక్తుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తినుబండారాల ఆవరణలో పరిశుభ్రత, పాటించాలని, నిబంధనలు, మార్గదర్శకాలను పాటిస్తూ తిరుమల ఖ్యాతిని నిలబెట్టాలని సూచించారు.

సరైన సీటింగ్ ఏర్పాట్లు, పొడి మరియు తడి చెత్తలను వేర్వేరు డస్ట్ బిన్‌లలో వేరు చేయడం, హోటల్ నిర్వాహణ ధృవపత్రాలను తమ హోటళ్ల బయట ప్రదర్శించడం, ముడి సరుకుల నిల్వ కోసం సరైన నిల్వ గది ఏర్పాటు, పెస్ట్ కంట్రోల్ మెషీన్‌లను ఉంచడం, సరైన అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోవడం, పారిశుద్ధ్య విధానాలను పాటించడం వంటివి తప్పకుండా పాటించాలని ఆయన అన్నారు. అనంతరం దుకాణదారులందరికీ ఎస్‌ఓపీ జాబితాను సిద్ధం చేయాలని, చెక్‌లిస్ట్ ఇవ్వాలని, ఏవైనా కొరత ఉంటే వాటిని సరిదిద్దేందుకు కొంత సమయం ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక నుంచి కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేస్థామని, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తారని, ఆయన చెప్పారు. తిరుమలలోని అన్ని తినుబండార కేంద్రాలు పరిశుభ్రత పాటించాలని, యాత్రికుల భద్రతే ప్రధాన అజెండాగా టీటీడీ ఖ్యాతిని నిలబెట్టాలని అదనపు ఈఓ పునరుద్ఘాటించారు.

Share this post with your friends