తిరుపతిలోని అలిపిరి వద్దకు వెళ్లగానే ఆధ్యాత్మిక భావన వెల్లివిరిస్తూ ఉంటుంది. దీనిని మరింత పెంచేదిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తోంది. తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతను, మానసిక ఉల్లాసాన్ని అందించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించారు. టీటీడీ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులకు సుందరీకరణలో భాగంగా బీఆర్ నాయుడు ఇటీవల పలు అదేశాల జారీ చేశారు. ముఖ్యంగా ఏడు కొండలలో చివరి కొండైన గరుడాద్రి పర్వత శ్రేణులు వద్ద విద్యుత్ దీపాలను టీటీడీ విద్యుత్ విభాగం ఏర్పాటు చేసింది. కొన్ని అనివార్య కారణాల వలన గత ఐదేళ్లుగా గరుడాద్రికి విద్యుత్ వెలుగులు లేకుండా పోయాయి.
ప్రస్తుతం టీటీడీ చైర్మన్ తీసుకున్న నిర్ణయంతో తిరిగి గరుడాద్రి కాంతులీనుతోంది. ట్రయిల్ రన్ కింద ముందుగా వినాయకుడి ఆలయం వద్ద 6 ఫోకస్ లైట్లను టీటీడీ సిబ్బంది ఏర్పాటు చేసింది. తిరుమల ఉత్సవాలలో భాగంగా 25 రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరగనుంది. ఈ క్రమంలోనే ధనుర్మాస వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ పాసుర పారాయణంగా పిలిచే అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు.