గత రెండు దశాబ్దాలుగా టీటీడీ అన్నప్రసాదం కార్యకలాపాలకు వివిధ రాష్ట్రాల నుంచి పంపుతున్న కూరగాయల దాతల అపారమైన సహకారాన్ని కొనియాడుతూ, లక్షలాది మందికి అన్నప్రసాదాన్ని మరింత రుచికరమైన రీతిలో అందించడానికి మరిన్ని రకాల కూరగాయలను పంపాలని అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వారిని కోరారు.తిరుమలలోని అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో కూరగాయల దాతలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, ఏడాది పొడవునా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు పరిశుభ్రమైన రీతిలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ నినాదమని అన్నారు.
అన్నప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో భుజించే ఆఖరి భక్తునికి కూడా అందేలా మరిన్ని రకాల కూరగాయలను విరివిగా అందించాలని దాతలను కోరారు. అందుకు దాతలు తాము ఎల్లప్పుడూ అందుకు సంసిద్ధంగా ఉన్నామని ముక్త కంఠంతో తెలిపారు. అంతకుముందు, ప్రత్యేక క్యాటరింగ్ అధికారి శ్రీ జిఎల్‌ఎన్ శాస్త్రి 2004లో ప్రారంభించిన కూరగాయల విరాళం గత 20 ఏళ్లలో సాధించిన ప్రగతిని గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం అదనపు ఈవో కోయింబేడు, తిరుప్పూర్, నామక్కల్, చిక్కబల్లాపూర్, విజయవాడ, పలమనేరు, హైదరాబాద్, తిరుపతికి చెందిన 24 మంది కూరగాయల దాతలను సన్మానించారు.