
ఏపీ ప్రభుత్వం టీటీడీ ఈవోను బదిలీ చేసింది. 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా టీటీడీ ఈవోను సైతం బదిలీ చేసింది. ఈ క్రమంలోనే బదిలీపై వెళుతున్న ఈవో శ్యామలరావుకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ.. తన కాలంలో చాలా దూరదృష్టితో విధానపరమైన పటిష్ట నిర్ణయాలు తీసుకుని అమలు చేశామన్నారు. టీటీడీ అంటే మినీ గవర్నమెంట్ అని, తిరుమలలో భక్తుల సౌకర్యాలు ఓ వైపు, స్థానిక ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు, ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తనకు నిత్యం పనిచేయడం మాత్రమే తెలుసునని, ప్రచారం చేసుకోవడం తక్కువ అని చెప్పారు. భక్తులు స్వయంగా తమకు అందుతున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయడంపై ఆనందంగా ఉందన్నారు.
ఉద్యోగుల సమిష్టి కృషితో భక్తులకు మెరుగైన సేవలు అందించడంపై సంతృప్తిగా ఉందన్నారు. ఐఏఎస్ లకు టిటిడి ఈవోగా పనిచేయాలని ఉంటుందని, తాను కూడా ఈవోగా పనిచేయాలనే కోరిక ఉండేదని పేర్కొన్నారు. ఆ కోరిక నెరవేరిందన్నారు. సన్మాన సభ ప్రారంభానికి ముందు బదిలీపై వెళ్తున్న ఈవో శ్రీ జె. శ్యామలరావుకు శ్రీవారి ఆలయం, తిరుచానూరు ఆలయం, శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి ఆలయాల అర్చకులు వేదాశీర్వచనం చేశారు. శ్యామలరావు స్థానంలో టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్‌ను ఈవోగా ఏపీ ప్రభుత్వం నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్ గతంలోనూ టీటీడీ ఈవోగా పని చేశారు. 2014-2019 మధ్య టీడీపీ హయాంలో కూడా అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా పనిచేశారు.
