తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్

వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు శనివారం సాయంత్రం పరిశీలించారు. టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, అడిషనల్ ఈఓ శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి మరియు ఇతర అధికారులతో కలిసి ఛైర్మన్ ముందుగా స్థానిక బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఎస్‌ఎస్‌డీ టోకెన్ జారీ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కృష్ణతేజ రెస్ట్‌ హౌస్‌లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు.

అనంతరం అన్నమయ్య భవన్‌లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ, జిల్లా, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకు సంబంధించి దాదాపు 1.20 లక్షల టోకెన్లను తిరుపతి, తిరుమలలో జారీ చేసేందుకు నిర్ణయించింది. వాహనాల పార్కింగ్ కు కూడా అవసరమైన స్థలలాను కేటాయించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు శ్రీమతి ఎం.గౌతమి, శ్రీ వి. వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ శ్రీధర్, ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీఈ శ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share this post with your friends