శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామికి తిరు నక్షత్ర మర్యాద

శ్రీ‌శ్రీ‌శ్రీ పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయర్‌స్వామి 75వ తిరు నక్షత్రం (జన్మదినం) సందర్భంగా మంగళవారం ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారి ఆలయంలో తిరు నక్షత్ర మర్యాద జరిగింది. పెద్ద మర్యాదలో భాగంగా రాగిమాను వద్ద పెద్ద జీయర్ స్వామికి ఇస్తికఫాల్ స్వాగతం పలుకగా మేళ తాళాల మధ్య శ్రీశ్రీశ్రీ చిన జీయర్ స్వామితో కలిసి ఆలయం వద్దకు విచ్చేశారు.

టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ శ్రీధర్ స్వామీజీకి మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ ఆలయ సాంప్రదాయం ప్రకారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న పెద్ద జీయర్ మఠానికి చేరుకున్నారు. ఇక్కడ పెద్ద జీయర్ స్వామీ టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, సీవీస్వోలకు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రికి ఘనంగా పుష్పాంజలి

తిరుమల తిరుపతి దేవస్థానంలో పేష్కారుగా, ఎపిగ్రాఫిస్టుగా విశేష సేవలందించిన శ్రీ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి 136వ జయంతి సందర్భంగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా గల వారి విగ్రహానికి మంగ‌ళ‌వారం డిపిపి ప్రాజెక్టు అధికారి శ్రీ రాజ‌గోపాల్‌ పుష్పాంజలి సమర్పించారు. ఈ సంద‌ర్బంగా శ్రీ శాస్త్రిగారి మనవడు, జిల్లా జడ్జి శ్రీ మూర్తి మాట్లాడుతూ, తిరుమలకు సంబంధించి అనేక చారిత్రిక, సాంస్కృతిక, ఇతిహాసిక శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ శాస్త్రి గారికి దక్కుతుందన్నారు. వారి జీవనం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు.

Share this post with your friends