మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం విజయనగర రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీశ. 1405 నుంచి 1459 మధ్యకాలంలో విజయనగర చక్రవర్తుల ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయల ఆదేశం మేరకు ఈ ఆలయాన్ని నెల్లూరు సీమను పరిపాలించిన సిద్దిరాజు తిమ్మ రాజయ్య నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆలయంలోని గర్భాలయం మొదలు.. అంతరాలయం, మధ్య రంగ మండపాలు, మహాద్వారం నిర్మాణం, గర్భగుడిపై విమాన గోపుర నిర్మాణాల వరకూ అన్నీ తిమ్మ రాజయ్య ఆధ్వర్యంలోనే జరిగాయి.

అయితే తిమ్మ రాజయ్య పూర్తి స్థాయిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారట. 1529లో అచ్యుత దేవరాయలు మిగిలిన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారని చెబుతారు. ఇక ఈ ఆలయ గోపుర నిర్మాణం 1929లో జరిగిందట. దీనిని లింగరాజు అనే భక్తుడు నిర్మించాడు. అనంతరం 1936లో శ్రీరంగం శ్రీనివాస మమలై జియ్యరు స్వామి గోపుర కలశ స్థాపన, మహా కుంభాభిషేకాన్ని నిర్వహించారు. చెన్నకేశవుని ఆలయంలో నిపించే అద్భుతమైన శిల్పకళా వైభవం విజయనగర రాజుల కాలం నాటి శిల్పుల నైపుణ్యానికి అద్దం పడుతుందని చెబుతారు. ఈ ఆలయ గాలిగోపురం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మానవ శరీరానికి ప్రతీకగా 9 అంతస్థులతో, 9 గవాక్షాలతో అతి సుందరమైన గాలి గోపురాన్ని నిర్మించడం జరిగింది.
