తిరుమల లడ్డు మారినట్టుగా తెలుస్తోంది. నెయ్యిలో నాణ్యత విషయంలో కాస్త శ్రద్ధ పెట్టడంతో శ్రీవారి లడ్డూ రుచి పెరిగినట్టుగా తెలుస్తోంది. నెయ్యి కల్తీతో లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందన్న దుమారం దేశవ్యాప్తంగా రేగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అలెర్ట్ అయ్యింది. ఇది కాస్తా శ్రీవారి మహా ప్రసాదంలో క్వాలిటీని పెంచింది. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంపై పెద్ద ఎత్తున కల్తీ జరిగిందంటూ రచ్చ జరుగుతున్నా కూడా డిమాండ్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఎప్పటిలాగే భక్తులు లడ్డూను కొనుగోలు చేస్తున్నారు.
గత వారంలో కేవలం నాలుగు రోజుల్లో లడ్డూ విక్రయాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. 14 లక్షలకు పైగా లడ్డూ ప్రసాదాన్ని భక్తులు విక్రయించారు. సెప్టెంబర్ 19న 3.59 లక్షల లడ్డూలు.. సెప్టెంబర్ 20న 3.17 లక్షలు, 21న 3.67 లక్షలు, 22న 3.60 లక్షల లడ్డూల అమ్మకాలు జరిగినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. మొత్తంగా టీటీడీ గణాంకాల ప్రకారం రోజువారీ సగటున దాదాపు 3.50 లక్షల లడ్డూలను భక్తులు విక్రయించారు. కల్తీ నెయ్యి వివాదాల నడుమ కూడా ఇలా భక్తులు లడ్డూ విక్రయాల్లో తేడా చూపకపోవడం ప్రస్తుతం టీటీడీ అవలంబిస్తున్న నాణ్యతా ప్రమాణాలే కారణమని తెలుస్తోంది.