డ్రైఫ్రూట్లు, రోజామాలల అలంకారంతో శోభాయమానంగా స్న‌పన తిరుమంజనం

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం శ్రీవారి ఆలయంలో ప‌విత్రాలు, డ్రైఫ్రూట్లు, రోజామాలల అలంకారంతో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించారు. నీలి పవిత్రాలు, లవంగాలు, వట్టివేరు, తులసి, డ్రైఫ్రూట్లు, రోజామాలలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించారు.

వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాల నడుమ రంగనాయకుల మండపం నూతనత్వాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు కొబ్బరినీళ్లు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. వేదపండితులు చతుర్వేదపారాయణం ఆలపించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహనసేవల్లో తిరువీధుల్లో ఊరేగి అలసిపోయే స్వామివారు స్నపనతిరుమంజనంతో సేద తీరుతారని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్‌ పర్యవేక్షణలో కంకణభట్టర్‌ శ్రీ వేణుగోపాలదీక్షితులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Share this post with your friends