దశాబ్ద కాలం తర్వాత రికార్డ్ స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

తిరుమల శ్రీవారిని అత్యధిక స్థాయిలో మే 31న 95,080 మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. దాదాపు దశాబ్ద కాలం అనంతరం ఇంత భారీ మొత్తంలో భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. మే 16 నుండి తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టీటీడీ ఉద్యోగులు అవిశ్రాంతంగా అహర్నిశలు విధులు నిర్వహించి, గత రెండు వారాల్లోని గురువారాలు, శుక్రవారాల్లో కూడా అత్యధిక మంది భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. టీటీడీ ఉన్నతాధికారుల నిర్దేశాల మేరకు, వివిధ విభాగాల అధిపతుల పర్యవేక్షణలో శ్రీవారి ఆలయ సిబ్బంది, విజిలెన్స్ విభాగం సహకారంతో అన్నప్రసాదం, తాగునీరు, పాల వితరణ భక్తులకు సమర్థవంతంగా అందించడం జరిగింది. దీంతో అనేకమంది భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకోగలిగారు.

గతేడాది మే నెలతో పోల్చితే, ఈసారి 55,759 మంది అధికంగా దర్శనం పొందారు. 2024 మేలో 23,23,493 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోగా, 2025 మేలో 23,79,252 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే, అన్నప్రసాద వితరణలో కూడా ఈ ఏడాది నూతన రికార్డు నమోదైంది. 2024 మేలో 71 లక్షల వితరణలు జరిగితే, ఈ సంవత్సరం 2025 మేలో 1.33 కోట్ల వితరణలు నమోదు కావడం విశేషం.
ఇంతేకాకుండా, ఈ మే నెలలో తలనీలాల సంఖ్య, లడ్డూ విక్రయాల పరంగా కూడా గత ఏడాది మేతో పోల్చితే అధికంగా నమోదు కావడం గమనార్హం.

Share this post with your friends