శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో ఆనందం నింపాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బీఆర్. నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామల రావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆకాంక్షించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్య, ఐశ్వర్యం, ఆనందంతో విరాసిల్లాలని కోరారు.
ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు..
తిరుమలలో ప్రతి భక్తుడికి నాణ్యమైన సేవలు అందించేందుకు గత ఆరు నెలలుగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. దాతల విభాగాన్ని పూర్తిగా ఆడిట్ చేయించి అర్హులైన దాతలకు సేవలు అందేలా, మధ్యవర్తులను పూర్తిగా నిషేధించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు వసతి ఎవరికి కేయించాలో తెలియని అగమ్య పరిస్థితి నుంచి మరింత పూర్తి పారదర్శకంగా వసతి గదులు కేటాయిస్తున్నామన్నారు. రాబోవు రోజులలో వసతి గదులు కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల వాట్సాప్ కే పూర్తి సమాచారం, రిజిస్ట్రేషన్ చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల భక్తులు ఎక్కువ సేపు వేచియుండకుండా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. విచక్షణ కోటాను , మానవ జోక్యాలను తగ్గించి భక్తులకు త్వరతిగతిన దర్శనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్బంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని అన్ని తరగతుల వారికి భేషుగ్గా ఏర్పాటు చేశామన్నారు.