బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ, అక్షతారోపణ ఎలా నిర్వహిస్తారంటే..

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీనికి ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 23న సాయంత్రం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం అంకురార్పణ నిర్వహిస్తారు. అసలు అంకురార్పణ అంటే ఏమిటి? ఆ తరువాత నిర్వహించే అక్షతారోపణ అంటే ఏమిటో తెలుసుకుందాం.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.

అక్షతారోపణ…

ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం.

Share this post with your friends