తిరుమలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో భోజనం చేసే వస్తారు. వారికి గుడ్ న్యూస్. అన్నప్రసాదంలో భాగంగా ఇప్పుడు వడ కూడా అందిస్తున్నారు. గురువారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ ఛైర్మన్ భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించామన్నారు.
ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగించనున్నారు. అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.