తిరుమలలో ప్రస్తుతం యాత్రికుల వసతి సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో అందుకు అనుగుణంగా వసతి సముదాయం లేదు. ఈ క్రమంలోనే నూతన వసతి సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ యాత్రికుల వసతి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తన్నారు.
తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని శుక్రవారం సాయంత్రం టీటీడీ అడిషనల్ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు. భవనంలో ఏర్పాటు చేస్తున్న కల్యాణ కట్ట, భోజనశాల, మరుగుదొడ్లు, విద్యుత్ వైరింగ్, హాళ్లను పరిశీలించారు. ఈ ఏడాది చివరిలోపు పనులను పూర్తి చేసి జనవరి నెలలోపు భవనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కాకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.