
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్లోని కర్ణి మాత ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయంలో దుర్గాదేవి రూపంగా భావించే కర్ణి మాత కొలువై ఉన్నా కూడా భక్తులు మాత్రం ఎలుకలకే ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ నల్ల ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. చక్కగా మన ముందే తిరుగుతూ ఉంటాయి. వాటికి భక్తులు ప్రసాదం అందించి.. అవి ముట్టినా.. తిన్నా శుభ శకునంగా భావిస్తారు. ఇక తెల్ల ఎలుకలు అరుదుగా కనిపిస్తాయి. అవి కనిపించాయంటే సాక్షాత్తు కర్ణి మాత కనిపించినట్టుగా భావిస్తారు. ఇక్కడి ఎలుకలు కర్ణిమాత వారసులు, అనుచరుల పునర్జన్మలని చెప్పుకున్నాం కదా.
ఇప్పుడు ఈ ఆలయం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. కర్ణి మాత పెంపుడు కుమారుడు అయిన లక్ష్మణ్ కోలయత్కు ఒకరోజు బాగా దాహం వేసిందట. తెహసీల్‌లోని కపిల్ సరోవర్ వద్ద సరస్సులో నీరు తాగేందుకు వెళ్లాడట. నీళ్లు తాగే క్రమంలో పొరపాటున సరస్సులో పడిపోయాడట. అప్పుడు కర్ణిమాత తన కుమారుడిని కాపాడమంటూ యముడిని కోరుతుంది. మొదట యముడు వీలు పడదని చెబుతాడు. ఆ తరువాత మనసు మార్చుకుని లక్ష్మణ్‌తో పాటు కర్ణిమాత మగ సంతానమంతా ఎలుకలుగా పునర్జన్మ ఎత్తుతారని వరమిచ్చాడట. కాబట్టి ఈ ఆలయంలో మనకు కనిపించే ఎలుకలన్నీ కర్ణిమాత సంతానంగా చెబుతారు.
