విశాఖపట్నం సమీపంలో తూర్పుకనుమల్లోని సింహగిరిపై ప్రకృతి ఒడిలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిజరూప దర్శనం నేడు లభించనుంది. ముఖ్యంగా వైశాఖ శుక్ల పక్ష తదియ రోజున అంటే అక్షయ తృతీయ రోజున స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేయనుంది. ఏడాదంతా చందనంతో కప్పి ఉన్న స్వామివారు.. అక్షయ తృతీయ నాడు 12 గంటల పాటు మాత్రం చందనం ఏమీ లేకుండా నిజరూపంలో దర్శనమిస్తూ ఉంటారు. నిజానికి స్వామివారు ఏ ఆలయంలోనైనా ఏదో ఒక రూపంలో దర్శనమిస్తూ ఉంటారు.
ఒక ఆలయానికి మరో ఆలయానికి విష్ణుమూర్తి అవతారంలో పోలిక ఉండకపోవచ్చు. ఇలా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే స్వామివారు.. సింహాచలంలో మాత్రం రెండు రూపాల్లో దర్శనమిస్తారు. అయితే ఇక్కడ స్వామివారు.. వరాహ లక్ష్మీనరసింహ స్వామిగా రెండు రూపాల్లో ఎందుకు దర్శనమిస్తూ ఉంటారు? అంటే దీని వెనుక ఓ కథ ఉంది. హిరణ్యకశ్యపుడిని లక్ష్మీనరసింహ స్వామి సంహరించిన అనంతరం ప్రహ్లాదుడిని స్వామివారు ఏం వరం కావాలో కోరుకోమన్నారట. దీనికి ప్రహ్లాదుడు నీ రెండు అవతారాలను ఏకకాలంలో దర్శించుకునే భాగ్యం కావాలని కోరాడట. అనుగ్రహించిన స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిగా అవతరించారట.