భయ భక్తులు ఉండాలి అంటారెందుకు?

మనం నిత్యం వినే మాట భయం భక్తీ లేకుండా పోతున్నాయి అని. ముఖ్యంగా చిన్నారులను ఈ మాట అంటూ ఉంటాం. ఎందుకంటే చిన్ననాటి నుంచి భయంతో పాటు భక్తిని చిన్నారులకు అలవాటు చేయాలి. దైనికైనా బీజం బాల్యంలోనే వేయాలి. ఎందుకంటే మొక్కై వంగనిది.. మానై వంగుతుందా? అంటారు కదా. కాబట్టి భయం, భక్తులనేవి ఎవరికైనా బాల్యం నుంచే ఉండాలి. అలా ఉంటేనే.. ఒక పని చేసే ముందర ఆలోచిస్తారు. చిన్నప్పుడు తలిదండ్రులు, గురువుల భయం లేకపోతే పిల్లలు తప్పు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. తాము ఈ తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏమైనా అంటారనే భయం ఉంటేనే తప్పుల జోలికి వెళ్లరు.

ఇక భయం కంటే భక్తి అత్యవసరం. భయం అనేది తాత్కాలికమే. భక్తి అనేది జీవితంతో పెనవేసుకుపోయి ఉంటుంది. తప్పొప్పుల ప్రస్తావన తెలియనంత వరకే భయం.. ఆపై వ్యక్తిని భక్తే కాపాడుతుంది. భక్తి ఒకసారి మనసులో పాతుకుపోతే అది కలకాలం ఉంటుంది. భక్తి ఉంటే మంచి నడవడిక అలవాటవుతుంది. రామభక్తి వల్లే హనుమంతుడు అఖండ విజయాలను సాధించాడనడంలో సందేహం లేదు. భక్త రామదాసు, భక్త తుకారాం, భక్త జయదేవ, తులసీదాసు, అన్నమయ్య వంటి వారంతా భక్తితోనే చరిత్రలో నిలిచిపోయారు. అందుకే భయభక్తులనేవి మనిషికి ఉండాలి అంటారు.

Share this post with your friends