కనుమ రోజు ప్రయాణాలు ఎందుకు చేయకూడదంటే..

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు జరుపుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ అనే పేర్లతో మూడు రోజుల పాటు పండుగను జరుపుకుంటాం. కొన్ని చోట్ల నాలుగో రోజును సైతం ముక్కనుమ పేరుతో జరుపుకుంటారు. అయితే కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదని చెబుతారు. పొలిమేరలు సైతం దాటకూడదని అంటారు. దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం. సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తమ సొంత ఊళ్లకు చేరుకుంటారు. అలాంటి వారంతా కనుమ రోజున తిరుగు ప్రయాణం చేయకూడదని తెలుగు రాస్ట్రాల్లో చెబుతారు. ఇది ఈనాటిది కాదు.. పుర్వీకులు చెబుతున్న మాట. ఈ పండుగను రైతుల పండుగ అని కూడా అంటారు. ముఖ్యంగా కనుమ రోజున రైతులు తమ పశు సంపదను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఏడాది మొత్తం తమ కోసం శ్రమించిన పశువులను కనుమ రోజున ఆనందంగా పూజించుకుంటారు. కనుమ నాడు ఉదయాన్నే లేచి పశువులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేసి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. వాటి కాళ్లకు మువ్వలు.. మెడలు చిరు గంటలు కట్టి ఆనందిస్తారు. అనంతరం పశువులకు హారతిచ్చి మంచి ఆహారాన్ని అందజేస్తారు. అయితే వెనుకటి కాలంలో రవాణా వ్యవస్థ లేదు. ఎక్కడికెళ్లాలన్నా ఎడ్ల బండిపైనే వెళ్లేవారు. అలా కనుమ రోజున అంతగా పూజించుకున్న పశువులను కష్టపెట్టకూడదని.. వాటికి రెస్ట్ ఇవ్వాలని తీసుకొచ్చిందే కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదన్న సంప్రదాయం. మరి రవాణా వ్యవస్థ పెరిగిన నేటి రోజుల్లోనూ ఇది ఎందుకు కొనసాగుతోందన్న సందేహం రావొచ్చు. దీనికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. ఎక్కడెక్కడి నుంచో సొంతూళ్లకు అంతా వచ్చేస్తారు. ఆనందంగా మూడు రోజుల పాటు చిన్ననాటి మిత్రులతో కలిసి ఉండాలని ఈ నియమాన్ని కొనసాగిస్తున్నారు.

Share this post with your friends