కేరళలోని త్రివేండ్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అత్యంత ధనిక దేవాలయంగా పేరుగాంచింది. ఈ ఆలయంలో ఏడు నేలమాళిగలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఆరు నేలమాళిగలను తెరిచి అపార సంపదను అయితే గుర్తించారు. కానీ ఏడవ తలుపు తెరవడంపై మాత్రం చాలా వివాదం జరిగింది. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా.. ఏడో తలుపు తెరవడంపై నిషేధాజ్ఞలు విధించింది. అసలు ఏడవ తలుపు వెనుక ఉన్న రహస్యమేంటి? ఆలయ ఏడవ తలుపు చెక్కతో తయారు చేశారు. ఈ తలుపుపై పెద్ద పాము బొమ్మ చెక్కబడి ఉండటంతో తలుపు తెరిచే ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పడింది. పాము బొమ్మ చెక్కి ఉండటమంటే శేషుడిని కాపలా పెట్టడమేనని అంతా భావించారు.
అంతేకాకుండా ఈ ఏడవ ద్వారాన్ని మూసివేసే సమయంలో కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారని.. కాబట్టి దానిని తెరవడం అసాధ్యమని ప్రతి ఒక్కరి భావన. అలాగే తలుపు మీద ఉన్న శ్రీ మహా విష్ణువు పాన్పు అయిన పాము ఆకారాన్ని పరిశీలిస్తే ఇది నాగ పాశం వంటి ఏదైనా మంత్రంతో మూసి వేశారని పండితులు చెబుతున్నారు. దీనిని ఇప్పుడు తెరవాలంటే తప్పని సరిగా గరుడ మంత్రాన్ని పఠించాల్సిందేనట. అయితే అది కూడా అంత సులువేమీ కాదని చెబుతారు. తలుపు తెరచే ఈ మంత్రాలు చాలా కష్టమని అంటారు. ఒకవేళ సాహసం చేసి తలుపు తెరిచేందుకు యత్నిస్తే మాత్రం ఎలాంటి పొరపాట్లకూ తావు ఇవ్వకూడదు. ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ప్రాణ నష్టం సంభవిస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకనే ఏడవ గది మిస్టరీగానే మిగిలిపోయింది.