హనుమత్ జయంతి ఏడాదికి రెండు సార్లు ఎందుకు? ఏది అసలైన జయంతి?

హనుమత్ జయంతిని ఇవాళ దేశమంతా ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటోంది. అయితే ఏప్రిల్‌లో కూడా హనుమత్ జయంతిని జరుపుకున్నాం. ఇదేంటి.. జయంతి రెండు సార్లు ఎలా? అసలు వీటిలో ఏది నిజమైన జయంతి? అనేది తెలుసుకుందాం. సాధారణంగా హనుమత్ జయంతిని చైత్ర మాసంలో ఒకసారి, వైశాఖ మాసంలో మరోసారి జరుపుకుంటూ ఉంది. ఇలా ఎందుకంటే ఓ కథ ఉంది. సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకకు వెళతాడు. అశోకవనంలో ఆమె ఉందని తెలుసుకుంటాడు. ఆరోజు చైత్రమాసం, చిత్రా నక్షత్రం, పౌర్ణమి. సీతమ్మను జాడ తెలుసకున్న ఆనందంలో హనుమంతుడు అశోక వనాన్ని ధ్వంసం చేసి, కొంతమేర రావణ సైనికులను హతమారుస్తాడు.

అనంతరం రావణ సైన్యం తోకకు నిప్పంటించడంతో సగం లంకను దహనం చేస్తాడు. రావణ సైన్యంపై హనుమంతుడి విజయానికి గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలి. కానీ అది తెలియక జయంతిగా జరుపుకుంటున్నాం. దీనిని ఏప్రిల్‌లో జరుపుకున్నాం. ఇక ఇప్పుడు అసలు సిసలైన జయంతిని ఇవాళ జరుపుకుంటున్నాం. వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున నిజమైన హనుమత్ జయంతి. ఇది ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పరాశర సంహితలో సైతం హనుమత్ జయంతి ఇవాళనేనని స్పష్టం చేయడం జరిగింది.

Share this post with your friends