చిన్న వయసులోనే ఆడపిల్లతో వ్రతం ఎందుకు చేయిస్తారు?

నోములు, వ్రతాలు అనగానే మహిళలు మాత్రమే నోచుకునేవి అని భావిస్తారు. కాలక్రమంలో ఇది అలా స్థిరపడిపోయింది కూడా. సత్యనారాయణ స్వామి వ్రతంలోనే జంటగా కూర్చుంటారు తప్ప అమ్మవారికి చేసే ఏ వ్రతమైనా సరే.. మహిళలే చేస్తూ ఉంటారు. ఒక్కో సందర్భానికి ఒక్కో నోము. శ్రావణమాసం వస్తే చాలు.. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం అంటూ మహిళలు వ్రతాలు చేసుకుంటారు. ఇలా సందర్భాన్ని బట్టి వ్రతం ఉంటుంది. ఈ శ్రావణమాసం అంతా నోములు, వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. అయితే చిన్న వయసులోనే ఆడపిల్లలతో వ్రతం చేయిస్తూ ఉంటారు. ఇది ఎందుకు? అనేది తెలుసుకుందాం.

పూర్వకాలంలో ఆడపిల్లలకు పెద్దగా చదువుకునే అవకాశం ఉండేది కాదు. ఇంట్లోని మగ పిల్లలకు మాత్రం ఆ అవకాశం ఉండేది. వారు కూడా ఏ గురుకులాల్లోనో, వీధి బడుల్లోనో చదువుకునే వారు. మరి స్కూలు వెళ్లకుంటే సంస్కారం అనేది పిల్లలకు ఎలా తెలుస్తుంది? పైగా ఆ రోజుల్లో బాల్య వివాహాలు చాలా ఎక్కువ. మరి చిన్న పిల్లలకు ఎలా మెలగాలనేది ఎలా తెలుస్తుంది? అది తెలియజెప్పడం కోసమే ఆడపిల్లలతో చిన్న వయసులోనే నోములు, వ్రతాలు చేయించేవారు. ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి చేత తాంబూలం ఇప్పించేవారు. ఇలా చేయడం వలన చిన్న వయసులోనే ఆడపిల్లలకు భక్తి భావన, సత్ర్పవర్తన, పెద్దవారితో ఎలా మెలగాలి? అనేటువంటివి తెలిసేవి.

Share this post with your friends