విష్ణు మూర్తి కూర్మావతారం ఎందుకు ధరించాల్సి వచ్చింది?

దేవతలు వివిధ అవతారాలు ధరిస్తూ ఉంటారు. ఏ అవతారం ధరించినా కూడా లోక కల్యాణార్థమే. విష్ణుమూర్తి ఒకానొక తరుణంలో కూర్మావతారాన్ని సైతం ధరించాడు. అదెందుకో తెలుసుకుందాం. దేవేంద్రుడు గర్వంతో దుర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు. దుర్వాసుల వారికి అసలే ముక్కుపై కోపం. దేవేంద్రుడు చేసిన తప్పిదానికి ఆయన దేవతలందరికీ శాపం ఇస్తాడు. ఆ శాపమేంటంటే.. దేవతలంతా శక్తి హీనులవుతారని. నాటి నుంచి దేవతలు శక్తి హీనులై దానువుల చేతిలో పరాజయం పాలవుతున్నారట. దీంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్లి దేవతలంతా తమ బాధను వెళ్లగక్కారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు.. ఔషధ నిలయమైన క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సాధించమని చెప్పాడట.

క్షీరసాగర మదనం కోసం ముందుగా దానవులతో దేవతలు సంధి చేసుకున్నారట. క్షీర సాగర మదనంతో వచ్చిన అమృతాన్ని కలిసి పంచుకుందామని చెప్పగా దానవులు ఓకే చెప్పారట. దీంతో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని.. వాసుకుని తాడుగా చేసుకుని క్షీర సాగర మధనాన్ని దేవతలు, దానవులు మొదలు పెడతారు. కానీ మందర పర్వతం బరువుకి సముద్రంలో మునిగి పోవడం ఆరంభించింది. పర్వతం పూర్తిగా మునిగిపోతే అమృతం సాధించడం దుర్లభమవుతుందని గ్రహించిన దేవతలు మళ్లీ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపారట. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు. తద్వారా దేవదానవులు అమృతాన్ని సాధిస్తారు.

Share this post with your friends