అసలు కన్నయ్యకు భక్తుడు ఇటుకను ఎందుకు విసిరేశాడు?

శ్రీకృష్ణుడికి విఠలుడని పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఒక భక్తుడు ఇటుకను విసిరేసి దానిపై నిలబడి ఉండమని కోరాడట. అలా చిద్విలాసంగా నిలబడిన కన్నయ్యను విఠలుడని పిలుస్తున్నారు. అసలు సదరు భక్తుడు ఇటుక ఎందుకు విసిరేశాడో చూద్దాం. ఒకసారి రుక్మిణీ దేవి ఏదో సమస్యపై శ్రీ కృష్ణుడిపై కోపంతో ద్వారకను విడిచి వెళ్లగా.. ఆమెను వెదుక్కుంటూ కృష్ణుడు డిండి అడవికి చేరుకున్నాడట. అక్కడే రుక్మిణి దేవిని శ్రీకృష్ణుడు కనుక్కున్నాడట. అయితే రుక్మిణి దేవి ఉన్న అడవి సమీపంలో ఒక ఆశ్రమంలో పుండలీకుడు అనే విష్ణు భక్తుడు నివసిస్తున్నాడు. తల్లిదండ్రులకు ఎంతో సేవ చేసేవాడు. పుండలికుడి భక్తికి సంతోషించిన శ్రీ కృష్ణుడు, తన రుక్మిణీ దేవితో కలిసి పుండలీకుడి ఆశ్రమానికి వెళ్లాడు.

ఆ సమయంలో తల్లిదండ్రుల సేవలో పుండలీకుడు తరిస్తున్నాడు. కాబట్టి కన్నయ్యను కాసేపు వేచి ఉండమని కోరాడట. పుండలీకుడు,, కృష్ణుడు దగ్గరకు ఒక ఇటుక విసిరి.. దానిపై నిలబడి వేచి ఉండమని కోరాడు. భక్తుడి కోరిక మీదకు ఇటుకపై నిలబడి పుండలీకుడి రాక కోసం వేచి చూస్తున్నాడట. తల్లిదండ్రుల సేవ అనంతరం కన్నయ్య దగ్గరకు పుండలీకుడు వచ్చాడట. పుండలీకుడుకి తల్లిదండ్రుల మీద ఉన్న భక్తిశ్రద్దలను చూసి సంతసించిన విష్ణువు పుండలీకుడిని వరం కోరుకోమనగా.. ఇకపై ఇక్కడే ఉండిపొమ్మని కన్నయ్యను కోరాడట. భక్తుడి కోరిక మేరకు కన్నయ్య ఇటుకపై నిలబడి నడుముపై చేతులుంచి సంతోషకర భంగిమలో నిలబడిపోయాడట. అప్పటి నుంచి కన్నయ్యను విఠలుడని పిలుస్తారు.

Share this post with your friends