దక్షుడు ఓ యజ్ఞం తలపెడతాడు. దానికి తన కూతురైన సతీదేవిని, అల్లుడు పరమశివుడిని ఆహ్వానించడు. దీనికి కూడా ఓ కారణముంది. ఓ సందర్భంలో దక్షుడిని శివుడు ఏమాత్రం పట్టించుకోడు. కనీసం పలకరించడు. దీంతో పరమేశ్వరుడిపై తీవ్ర ఆగ్రహంతో ఉంటాడు. పైగా శివుడు ఉండే విధానం కూడా దక్షుడికి నచ్చదు. అందుకే యాజ్ఞానికి శివపార్వతులను ఆహ్వానించడు. అయినా సరే.. మమకరాం చంపుకోలేక సతీదేవి యాజ్ఞానికి వెళుతుంది. కానీ తండ్రి ఆమె వంకైనా చూడడు. అక్కడికి వెళ్లగానే అంతమందిని ఆహ్వానించి తన భర్తను ఆహ్వానించకపోవడం పార్వతీ దేవికి ఆగ్రహం తెప్పిస్తుంది.
తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి విపరీతమైన కోపంతో యోగాగ్నిలో దూకి తనువు చాలిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న పరమ శివుడు ఆగ్రహంతో ఊగిపోతాడు.సతీ వియోగాన్ని భరించలేక దక్ష యాజ్ఞాన్ని నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. పార్వతీ దేవి శరీరాన్ని భుజాన వేసుకుని పెద్ద ఎత్తున వినాశనానికి పూనుకుంటాడు. అప్పుడు శివుడిని యథాస్థితికి తీసుకు రావడం కోసం విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. అప్పుడు అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్ని శక్తిపీఠాలుగా అలరారుతున్నాయి. వాటిలో కీలకమైనవి అష్టాదశ శక్తిపీఠాలు.