ఖతు శ్యామ్ జీ కథ చాలా ఆసక్తికరం. భీముడి మనవడు, ఘటోత్కచుని కుమారుడైన బార్బరిక్ యుద్ధ విద్యలలో ఆరితేరాడు. పైగా మహాశివుని మెప్పించి మూడు బాణాలను వరంగా పొందాడు. అవి సంధిస్తే విశ్వ వినాశనం తప్పదు. కురుక్షేత్ర యుద్ధంలో ఓటమి అంచున నిలిచిన వారి తరుఫున పోరాడాలని తల్లి అనుమతితో బయలుదేరిన బార్బరిక్‌ను బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు. బార్బరిక్‌ను మాటల్లో పెట్టి అతని శిరస్సును దానంగా అడుగుతాడు. ఇచ్చిన మాట ప్రకారం బార్బరిక్ తన తలను నరికి ఇచ్చేస్తాడు. అసలు శ్రీకృష్ణుడు వేరే ఏ వరమూ కోరకుండా శిరస్సునే ఎందుకు కోరినట్టంటే.. ఏదైనా యుద్ధం ప్రారంభానికి ముందు ముల్లోకాల్లో ఉత్తమ క్షత్రియుని తలను యుద్ధభూమిని పూజించినందుకు బలి ఇవ్వాలి కాబట్టి బార్బరిక్ శిరస్సును దానం కోరినట్టు శ్రీకృష్ణుడు వెల్లడించాడు.
తనను యుద్ధాన్ని చివరి వరకూ చూడనివ్వాలని బార్బరిక్ కోరగా.. శ్రీకృష్ణుడు దానికి అంగీకరించాడు. అతని తల యుద్ధభూమికి సమీపంలో ఉన్న కొండపై పెట్టారు. అక్కడి నుంచి అయితే బార్బరిక్ యుద్ధం మొత్తాన్ని చూడవచ్చడు. ఫాల్గుణ మాసం ద్వాదశి నాడు బార్బరిక్ తన శిరస్సును దానం చేశాడు. మహాభారత యుద్ధం ముగిసే సమయానికి పాండవుల మధ్య యుద్ధంలో క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే విషయంలో వివాదం ఏర్పడింది. అప్పుడు శ్రీకృష్ణుడు… బార్బరిక్ తల ఈ యుద్ధం మొత్తాన్ని వీక్షించిందని కాబట్టి అతన్ని మించిన న్యాయమూర్తి లేరని అతన్ని అడగమని చెప్పాడు. పాండవులంతా కొండ వద్దకు వెళ్లి.. యుద్ధం క్రెడిట్ ఎవరిదని అడిగారు. దీనికి బార్బరిక్.. శ్రీకృష్ణుడిదని చెప్పాడు. దీనికి వివరణ కూడా ఇచ్చాడు. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుని యుద్ధ వ్యూహాల కారణంగానే విజయం సాధ్యమైందని చెప్పాడు.