దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు అత్యంత ప్రాధాన్యముంది. రేపు శ్రీ సీతారాముల కల్యాణాకి భద్రాద్రిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా నేడు రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. అయితే భద్రాద్రిలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక విశిష్టత ఉంటుంది. స్వామివారి కల్యాణం కోసం తలంబ్రాలను గోటితో వలిచి సిద్ధం చేస్తారు. అయితే తలంబ్రాలు అంటే ఎలా ఉంటాయి? సర్వసాధారణంగా పసుపు రంగులోనే కదా ఉంటాయి. సామాన్యుడి పెళ్లిలో అయినా దేవతల పెళ్లిలో అయినా తలంబ్రాలు ఒకే మాదిరిగా ఉంటాయి.
అయితే రామయ్య కల్యాణానికి వాడే తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి. స్వామివారి కోసం ముత్యాల తలంబ్రాలను వాడుతారు. అయితే ఇతర రోజుల్లో.. అంతెందుకు నిత్య కల్యాణంలో సైతం తలంబ్రాలు పసుపు రంగులోనే ఉంటాయి. నవమి రోజున మాత్రమే ఎరుపులో ఉంటాయి. దీనికి ఓ కారణముంది. అప్పట్లో తానీషా ప్రభువు.. భద్రాద్రి సీతారాముల కల్యాణం కోసం వాడే తలంబ్రాల్లో బుక్కా గులాలు, ఆవునెయ్యి, అత్తరు తదితర సుగంధ ద్రవ్యాలను వాడే వారట. సుగంధ ద్రవ్యాలు కలవడంతో తలంబ్రాలు ఎరుపు రంగులోకి మారాయి. ఇప్పటికే అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.