ధేనుకుడు అనే రాక్షసుడిని బలరాముడు సంహరించాడని తెలుసుకున్నాం. పురాణాల్లో ప్రతి ఒక్కరి పుట్టుక, మరణం వెనుక ఏదో ఒక కారణం అయితే తప్పక ఉంటుంది. మరి ధేనుకుడి మరణం వెనుక కారణం ఏంటి? అసలు పూర్వ జన్మలో ధేనుకుడు ఎవరో తెలుసుకుందాం. పూర్వ జన్మలో ధేనుకుడు బలిదానవుని కుమారుడు. అతని పేరు సాహసికుడు. పని పాటా లేకుండా గంధమాదన పర్వతంపై తిరుగుతూ ఉండేవాడు. ఆ పర్వతంపై ఒక గుహ ఉండేది. దానిలో దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయనను నిత్యం సాహసికుని ఆటపాటలు మహర్షి ధ్యానానికి అంతరాయం కలిగిస్తూ ఉండేవి.
ఒకరోజు తీవ్రంగా విసుగు చెందిన దుర్వాస మహర్షి తీవ్ర ఆగ్రహంతో ‘నువ్వు గాడిదవై పుడతావు’ అని సాహసికుడ్ని శపించారు. మహర్షి శాపంతో సాహసికుడు మధురానగర సమీపంలోని తాళవనంలో గార్దభ రూపంలో ధేనుకుడి పేరిట సంచరిస్తుండేవాడు. బలవంతుడు కావటం వలన ఆ తాళవనానికి అధిపతిగానూ.. తాళవనంలో అడుగు పెట్టిన వారిని సంహరిస్తూ ఉండేవాడు. ఇక ఆ తరువాత బలరామకృష్ణులతో పోరాడటం.. వారి కరస్పర్శ ద్వారా శాప విమోచనం పొందడం జరిగాయి. అది ధేనుకుడి కథ.