ప్రస్తుత తరుణంలో చాలా మంది ఇంటి అందం కోసమో, పచ్చదనం కోసమో, ఆక్సీజన్ కోసమో.. కారణం ఏదైనా మొక్కలను పెంచుకుంటున్నారు. అలా ఇంట్లో స్థలం ఉన్నా లేకున్నా పెంచుకునే మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. ఇంటి గుమ్మం దగ్గర, బాల్కనీ, హాల్ వంటి చోట్ల దీన్ని పెంచుకుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే మనీకి లోటుండదని అంటారు. అయితే మనీ ప్లాంట్‌ను ఏ దిక్కులో పెంచుకోవాలో తెలుసుకుందాం. మనీ ప్లాంట్‌ను శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల మధ్యలో నాటాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

సహజంగా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోవాలని అనుకుంటే మీ ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ పక్కన కిటికీ ఉంటే దానికి పాకేలా ఏర్పాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే ఫలితం అద్బుతంగా ఉంటుందట. మనీ ప్లాంట్ మొక్క ఎప్పుడూ పైకి పాకేలా చూసుకోవాలి కానీ.. కిందకు పాకేలా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. మనీ ప్లాంట్‌కు పసుపు రంగు ఆకులు వస్తున్నట్లయితే వాటిని కట్ చేస్తుండాలి. లక్ష్మీ కటాక్షం కోసం ఇంటి ఆవరణలోని ఆగ్నేయ మూలలో మనీ ప్లాంట్‌ను ఉంచడం ఉత్తమమని అంటున్నారు. ప్రతీ శుక్రవారం సాయంత్రం పూట ఆ మనీ ప్లాంట్‌కు ఒక ఎరుపు రంగు దారాన్ని కట్టి, ఆవు నెయ్యి పోసి దీపం పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు.
