
తిరుమల శ్రీవారి ఆలయంలో రాముల వారి మేడ ఉంటుంది. అదెక్కడుంటుందో తెలుసుకుందాం. స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించేదే ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది అని కూడా అంటారు.
శయనమండపం :
రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.
కుల శేఖరపడి :
శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరపడి. పడి అనగా మెట్టు, గడప అని అర్థం.
